బంగాల్‌లో శాసనసభ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ప్రచారం వేడెక్కుతోంది. ప్రధాన ప్రత్యర్థులైన అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), భారతీయ జనతా పార్టీలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఈ రెండు పార్టీలు ఒకే చోట ర్యాలీలు చేపట్టనుండటం ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
ఎన్నికల ప్రచారం కోసం కమలనాథులు పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 'పరివర్తన' పేరుతో మొత్తం 5 రథ యాత్రలు చేయనున్నట్లు భాజపా ప్రకటించింది. ఫిబ్రవరి 6 నుంచి ఈ యాత్ర మొదలుకానున్నట్లు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తెలిపారు.
"ఇప్పటివరకు ఐదు యాత్రలు చేసేందుకు నిర్ణయించాం. కాక్ద్వీప్ నుంచి కోల్కతా వరకు చివరి యాత్ర చేస్తాం. పార్టీలోని కీలక సభ్యులతో భేటీ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నాం. చివరి రథ యాత్రకు ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానిస్తాం. రథ యాత్ర అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాం. అనుమతి నిరాకరిస్తే కోర్టుకు వెళ్తాం."
- దిలీప్ ఘోష్, బంగాల్ భాజపా అధ్యక్షుడు
పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తొలి రథయాత్రను ఫిబ్రవరి 6న జెండా ఊపి ప్రారంభించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫిబ్రవరి 11న కూచ్ బిహార్లో రెండో రథయాత్రకు పచ్చజెండా ఊపనున్నారు. మిగిలిన మూడు యాత్రల వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని దిలీప్ చెప్పారు.
రాష్ట్రంలో దీదీ సర్కార్ను దించడమే లక్ష్యంగా భాజపా పావులు కదుపుతోంది. సీఎం మమతా బెనర్జీపై భాజపా సీనియర్ నేత విజయ్ వర్గీయ విమర్శల దాడి పెంచారు.
"ఆమె (మమతా బెనర్జీ) సొంత పార్టీ నేతలే భాజపాలో చేరుతున్నారు. ఎందుకంటే మమత వారిని మోసం చేశారు. బంగాల్‌లో ప్రస్తుతం హింస, అవినీతి, మాఫియా రాజ్యం నడుస్తోంది."
- విజయ్ వర్గీయ, భాజపా సీనియర్ నేత
టీఎంసీ కూడా..
భాజపా రథయాత్రను నడ్డా ప్రారంభిస్తోన్న రోజే తృణమూల్ యూత్ కాంగ్రెస్ కూడా ర్యాలీకి పిలుపునిచ్చింది. శనివారం నుంచి రెండు రోజుల పాటు నదియా జిల్లావ్యాప్తంగా జనసమర్థన్ యాత్ర పేరుతో మోటార్ సైకిళ్లతో ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపింది. దీంతో నదియా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతోంది.
నడ్డా బంగాల్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భద్రతను పెంచారు. గతేడాది కోల్‌కతాలో నడ్డా వాహనశ్రేణిపై దాడి జరిగింది. ఆ ఘటనను దృష్టిలో ఉంచుకుని ఈసారి బందోబస్తు పెంచారు. ఏపిల్ర్-మే నెలల్లో బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఇవీ చూడండి: