BJP Parliamentary party meeting: పార్లమెంట్లో హాజరు విషయంపై భాజపా ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరికలు చేశారు. ఎంపీలు తమకు తాముగా మారకపోతే.. తామే మార్పులు చేస్తామని అన్నారు. అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో నిర్వహించిన భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
పార్టీ ఎంపీలందరూ తమ నియోజకవర్గాల్లో క్రీడాపోటీలు నిర్వహించాలని మోదీ సూచించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. క్రమం తప్పకుండా పార్లమెంట్‌కు రావాలని స్పష్టం చేసినట్లు చెప్పారు.
పార్టీ జిల్లా అధ్యక్షులతో మోదీ భేటీ
మరోవైపు, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ఎంపీలకు కీలక సూచనలు చేశారు. పార్టీ జిల్లా, మండల అధ్యక్షులతో తరచుగా సంప్రదింపులు జరపాలని సూచించారు. వారితో టీ తాగాలని చెప్పారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నియోజకవర్గమైన వారణాసిలోని.. పార్టీ జిల్లా అధ్యక్షులతో డిసెంబర్ 14న భేటీ అవుతారని వివరించారు.
తొలిసారి పార్లమెంట్ కాంప్లెక్స్ బయట...
సంప్రదాయానికి భిన్నంగా దిల్లీలోని అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో భేటీకావాల్సి ఉన్నప్పటికీ.. అక్కడ మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో ఒకరోజు ముందుగా సమావేశ వేదికను మార్చారు. పార్లమెంట్ కాంప్లెక్స్ బయట.. భాజపా పార్లమెంటరీ భేటీ జరగడం ఇదే తొలిసారి.
PM Modi news:
ఈ కార్యక్రమానికి మోదీ సహా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ఎంపీలు, మంత్రులు, కీలక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీకి పూలమాలలు వేసి స్వాగతం పలికారు నేతలు. నవంబర్ 15ను బిర్సా ముండా జయంతిగా నిర్వహించుకోవాలని చేసిన ప్రకటనపై కేంద్ర మంత్రి అర్జున్ ముండా హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. శాలువా కప్పి సత్కరించి.. జ్ఞాపికను బహూకరించారు.
Parliament Session BJP:
సాధారణంగా పార్లమెంట్ సమావేశాలు జరిగేటప్పుడు ప్రతి మంగళవారం ఈ భేటీ నిర్వహిస్తుంటుంది భాజపా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంపీలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభలో సభ్యులు పాటించాల్సిన క్రమశిక్షణ, బిల్లుల అమలు వ్యూహాలు సహా ఇతర కీలక అంశాలపై చర్చ జరుపుతారు. అయితే, పలు కారణాల వల్ల గత వారం పార్లమెంటరీ సమావేశం జరగలేదు.
ఇదీ చదవండి: 'దివ్య కాశీ భవ్య కాశీ' వేడుకకు మోదీ.. భాజపా సీఎంలకు ఆహ్వానం