ఉత్తరాఖండ్‌లో అసమ్మతి సెగతో ముఖ్యమంత్రి పీఠాన్ని వీడిన త్రివేంద్ర సింగ్ రావత్ స్థానంలో కొత్త సీఎం ఎంపిక ప్రక్రియను అధిష్ఠానం చేపట్టింది. నూతన సీఎంగా తీరథ్ సింగ్ రావత్ పేరును ప్రకటించింది. దేహ్రాదూన్‌లోని పార్టీ కార్యాలయంలో భాజపా శాసనసభాపక్ష నేతలు బుధవారం భేటీ అయి తీరథ్‌ను ఎన్నుకున్నారు. అంతకుముందు సీఎం రేసులో ప్రముఖంగా కొందరి పేర్లు వినిపించినా.. అనూహ్యంగా తీరథ్ వైపే పార్టీ మొగ్గు చూపింది. తీరత్ సింగ్ రావత్ ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో గడ్వాల్ ఎంపీగా ఉన్నారు.
బుధవారం సాయంత్రం 4 గంటలకు తీరథ్ సింగ్ రావత్.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ప్రజల కోసం..
తనపై నమ్మకం ఉంచి.. ముఖ్యమంత్రిగా ప్రకటించినందుకు ప్రధాని, కేంద్ర హోం మంత్రి, పార్టీ అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు తీరథ్ సింగ్. తానొక చిన్న గ్రామం నుంచి వచ్చానన్న ఆయన.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు.
ఉత్తరాఖండ్‌లో రావత్ నాయకత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం మార్పు కోరుతూ గత కొన్నిరోజులుగా కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు దిల్లీలో మకాం వేశారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు గత సోమవారం దిల్లీ వెళ్లి భాజపా పెద్దలను కలిసిన రావత్.. మంగళవారం తన రాజీనామాను ప్రకటించారు. కొత్త వారికి రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని పార్టీ నాయకత్వం ఆదేశించిందని, ఆ మేరకే తాను ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు విలేకరుల సమావేశంలో తివేంద్ర సింగ్ వెల్లడించారు. గ్రామీణ నేపథ్యం కలిగిన తనకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగేళ్లపాటు కొనసాగే అదృష్టాన్ని పార్టీ కల్పించిందని తెలిపారు.