భాజపా జాతీయ కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. భాజపా కార్యకర్తలంతా కలిసి ఉమ్మితే.. ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, ఆయన కేబినెట్ ఆ ఉమ్ములో కొట్టుకుపోతుందని వ్యాఖ్యానించారు. ఛత్తీస్గఢ్ ఇన్ఛార్జ్గా ఉన్న ఆమె.. బస్తర్ జిల్లా కేంద్రం జగదల్పుర్లో భాజపా కార్యకర్తల సదస్సుకు హాజరై గురువారం ఈ వ్యాఖ్యలు చేశారు.
కార్యకర్తలు కష్టపడితే 2023లో రాష్ట్రంలో భాజపా కచ్చితంగా అధికారంలోకి వస్తుందని పురందేశ్వరి అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వ్యూహాత్మక సన్నద్ధతపై మూడు రోజుల పాటు ఈ సదస్సు నిర్వహించారు.
సీఎం ఘాటు స్పందన..
పురందేశ్వరి వ్యాఖ్యలపై సీఎం భూపేశ్ బఘేల్ కూడా ఘాటుగా స్పందించారు. ఆమె మానసిక స్థితి ఇంత దిగజారుతుందని తాను ఊహించలేదన్నారు. పురందేశ్వరి కాంగ్రెస్ హయాంలో కేంద్ర సహాయమంత్రిగా పనిచేసినప్పుడు బాగానే ఉన్నారని, భాజపాలో చేరిన తర్వాతే ఇలా మారిపోయారని విమర్శించారు. ఆకాశంలోకి ఉమ్మితే అది తిరిగి వారి మొహం మీదే పడుతుందని చురకలంటించారు.

ఇదీ చదవండి: 'కుల ధ్రువీకరణపై పదేపదే విచారణ హానికరం'