కాంగ్రెస్, టీఎంసీ, ఎన్సీపీ వంటి 5 పార్టీల మొత్తం విరాళాలకు మూడు రెట్లు విరాళాలు భారతీయ జనతా పార్టీకి అందినట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) నివేదిక తెలిపింది. మేయర్, డిప్యూటీ మేయర్ తమ పార్టీ నుంచే ఉన్న మహారాష్ట్రలోని అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చిన విరాళాలను సైతం భాజపా వెల్లడించినట్లు పేర్కొంది. పార్టీ తెలిపిన వివరాల్లో ముగ్గురు దాతల నుంచి భూమిని సైతం పొందినట్లు ఉందని తెలిపింది.
" భాజపా వెల్లడించిన విరాళాలు.. కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, టీఎంసీకి వచ్చిన మొత్తం విరాళాలకు మూడింతలు ఉన్నాయి. 5 పార్టీలు కలిపి రూ.228.035 కోట్ల విరాళాలు చూపించగా.. భాజపా రూ.785.77 కోట్లు వచ్చినట్లు తెలిపింది. భాజపా తెలిపిన 570 విరాళాలు(రూ.149.875 కోట్లు), టీఎంసీ పొందిన 52 విరాళాలు (రూ.7.1035కోట్లు), కాంగ్రెస్కు వచ్చిన 25 విరాళాలు(రూ.2.6875కోట్లు), ఎన్సీపీకి అందిన 2 డొనేషన్లు (రూ.3.005 కోట్లు)కు చెక్, డీడీల పూర్తిస్థాయి వివరాలు లేవు."
- ఏడీఆర్ నివేదిక.
2019-20 ఆర్థిక ఏడాదిలో ఎన్నికల సంఘానికి సమర్పించిన లెక్కల ప్రకారం.. జాతీయ పార్టీలు అందుకున్న విరాళాలపై(ఒక్కో విరాళం కనీసం రూ.20వేలు) నివేదిక రూపొందించింది ఏడీఆర్.
నివేదిక ప్రకారం.. అమరావతి పురపాలక సంఘం నుంచి భాజపాకు రూ.4.80 లక్షల విరాళాలు అందాయి. 'ఈ విరాళాలకు సంబంధించి చిరునామా, బ్యాంక్ పేరు, పాన్ వంటి ఏ ఇతర వివరాలను పార్టీ అందించలేదు. అంతర్జాలంలో సర్చ్ చేస్తే.. దాత మహారాష్ట్ర ప్రభుత్వం స్థానిక విభాగం అని ఉంటుంది. అది మున్సిపల్ కార్పొరేషన్ అందించిన నిధుల చట్టబద్ధతపై పలు ప్రశ్నలకు తావిస్తోంది.' అని నివేదిక పేర్కొంది. అలాగే.. ముగ్గురి నుంచి భాజపా పొందిన భూమి విలువ రూ.1.516 కోట్లుగా ఉందని తెలిపింది ఏడీఆర్. ఆ మూడు విరాళాలు బిహార్ ఝంఝార్పుర్కు చెందినవేనని పేర్కొంది. అయితే.. వారి వివరాలు సైతం లేవని స్పష్టం చేసింది.
మరోవైపు.. సీపీఎం, సీపీఐ సైతం తాము పొందిన విరాళాలకు సంబంధించి చెక్, డీడీల పూర్తి వివరాలు వెల్లడించటంలో విఫలమయ్యాయని ఏడీఆర్ తెలిపింది. సీపీఎం రూ.1.0786 కోట్లు విలువైన 39 విరాళాలు, సీపీఐ 29 మంది నుంచి రూ.52.17 లక్షల విరాళాలు పొందినట్లు చెప్పింది.
ఇదీ చూడండి: ఎలక్ట్రోరల్ ట్రస్టుల ద్వారా భాజపాకు రూ.276.45 కోట్లు!