BJP CM Contenders In 2023 : మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల గెలుపుతో బీజేపీలో జోష్ పెరిగింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి పీఠంపై ఉత్కంఠ నెలకొంది. మధ్యప్రదేశ్‌లో సీఎం రేసులో శివరాజ్ సింగ్ సహా కేంద్రమంత్రులు నరేంద్ర తోమర్, జ్యోతిరాథిత్య సింధియా ఉన్నారు. వీరిలో శివరాజ్వైపే మరోసారి బీజేపీ అధిష్ఠానం మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి.
మరోసారి సీఎంగా శివరాజ్..
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్‌పై కొంత వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో ఎన్నికల సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది బీజేపీ. ఆయన్ను పక్కనబెడుతున్నామనే సంకేతాలిస్తూ కేంద్ర మంత్రులను, ముఖ్యనేతలను రంగంలోకి దించింది. సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్లింది. అయితే ఆదివారం విడుదలైన మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 150 సీట్లకు పైగా విజయం సాధించడంలో శివరాజ్ కరిష్మా కూడా కారణమని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి శివరాజ్నే సీఎం పీఠంపై కూర్చోబెట్టేందుకు యోచిస్తోందని పార్టీ వర్గాలు తెలిపాయి.
కాగా.. మధ్యప్రదేశ్ సీఎం రేసులో శివరాజ్‌కు పోటీగా కేంద్రమంత్రులు నరేంద్ర తోమర్, జ్యోతిరాథిత్య సింధియా ఉన్నారు. శివరాజ్‌ను పక్కనపెట్టి వీరిలో ఒకరిని బీజేపీ అధిష్ఠానం సీఎం కుర్చీలో కూర్చోబెడుతుందని వార్తలు వచ్చాయి. అయితే శివరాజ్ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లి భారీ విజయం సాధించడం వల్ల ఆయన వైపు మరోసారి మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి.
రాజస్థాన్ పీఠం ఎవరిదో?
రాజస్థాన్‌లో స్పష్టమైన మెజారిటీ సాధించిన బీజేపీ.. సీఎం కుర్చీలో ఎవరిని కూర్చోబెడుతుందనేది ఆసక్తికరం. సీఎం రేసులో మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, కేంద్రమంత్రులు గజేంద్ర షెకావత్, అర్జున్‌రామ్ మేఘ్వాల్, రాజస్థాన్ బీజేపీ చీఫ్ సీపీ జోషి, ఎంపీ దియా కుమారి, మహంత్ బాలక్‌నాథ్ యోగి ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు పార్టీపై పట్టు, రెండు సార్లు సీఎంగా చేసిన అనుభవం ఉండడం వల్ల ఆమెకు ముఖ్యమంత్రి పీఠం లభించే అవకాశాలు ఉన్నాయి.
కేంద్రమంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్.. ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి కావడం ఆయనకు కలిసొచ్చే అంశమని చెప్పాలి. అలాగే యాదవ కులానికి చెందిన మహంత్ బాలక్‌నాథ్ యోగి కూడా సీఎం రేసులో ఉన్నారు. హిందీ రాష్ట్రాల్లో ఓబీసీలు ఎక్కువ ఉండడం, హిందుత్వ కోసం ఆయనకు పగ్గాలు అప్పజెప్పే అవకాశాలను కొట్టిపారేయలేం. అలాగే రాజ్‌పుత్ వర్గానికి చెందిన గజేంద్ర సింగ్ షెకావత్ కూడా ముఖ్యమంత్రి పీఠం రేసులో ఉన్నారు. ఇప్పటికే రాజ్‌పుత్‌కు వర్గానికి చెందిన చెందిన యోగి ఆదిత్యనాథ్, పుష్కర్ సింగ్ ధామీ సీఎంలుగా ఉన్నారు. అలాగే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారని.. అధిష్ఠానం అండదండలు ఆయనకు ఉన్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ ఎన్నికలకు నాలుగు నెలల వ్యవధి మాత్రమే ఉండడం వల్ల పార్టీ అధిష్ఠానం సామాజిక సమీకరణాలను సైతం పరిగణనలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
చావల్ బాబాకే ఛత్తీస్‌గఢ్!
ఛత్తీస్‌గఢ్‌లో మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ సీఎం రేసులో ఉన్నారు. ఆయనకు పోటీగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ కుమార్ సావో, ప్రతిపక్ష నేత ధరమ్‌లాల్ కౌశిక్, మరోనేత ఓపీ చౌదరి నిలిచారు. రమణ్‌సింగ్ మినహా ముగ్గురు నాయకులు ఓబీసీ వర్గానికి చెందినవారే కావడం గమనార్హం. అయితే పార్టీ అధిష్ఠానం మాత్రం రమణ్ సింగ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
ఎంపీ మళ్లీ బీజేపీదే- పేద మహిళల అండ, మామా-మోదీ కరిష్మాతో ఘన విజయం
ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ అద్భుతం- పక్కా స్కెచ్‌తో బఘేల్ పాలనకు తెర