BJP CM Contenders In 2023 : తాజాగా జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాలు నమోదు చేసి అధికారాన్ని దక్కించుకున్న భారతీయ జనతా పార్టీ ఆయా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమైంది. ఈ మూడు రాష్ట్రాలకు కొత్త ముఖాలను సీఎంలుగా నియమించే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ మూడు రాష్ట్రాలకు సీఎంలను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ సీఎంలను ఎంపిక చేసే పనిలో బీజేపీ కేంద్ర నాయకత్వం బిజీగా ఉంది. మంగళవారం ప్రధాని మోదీ నివాసంలో దీనిపై నాలుగున్నర గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ భేటీకి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ బీజేపీ ఇన్‌ఛార్జ్‌లతో అమిత్ షా, నడ్డా సమావేశమయ్యారు. కేంద్ర నాయకత్వం నియమించనున్న పరిశీలకులు ఈ మూడు రాష్ట్రాల్లో ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశమై సీఎంల ఎంపికపై చర్చించనున్నారు.
మరోసారి సీఎం రేసులో శివరాజ్ సింగ్ చౌహాన్
మధ్యప్రదేశ్‌లో ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి సీఎం పదవిని ఆశిస్తున్నారు. కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ పటేల్, జ్యోతిరాదిత్య సింథియా, నరేంద్ర సింగ్ తోమర్, సీనియర్ నేత కైలాష్ విజయవర్గియా సీఎం పదవి కోసం రేసులో ఉన్నారు.
యోగికి మొగ్గు చూపుతారా?
మరోవైపు రాజస్థాన్‌లో మాజీ సీఎం వసుంధర రాజే ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ రామ్ మేఘ్‌వాల్, రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సీపీ జోషి, ప్రముఖ నేతలు దియా కుమారి, మహంత్ బాలక్‌నాథ్ కూడా సీఎం రేసులో ఉన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోనూ హోరాహోరీ
ఛత్తీస్‌గఢ్‌లో మాజీ సీఎం రమణ్‌సింగ్‌తో పాటు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ కుమార్ సావో, బీజేపీ నేత ధరమ్‌లాల్ కౌశిక్, మాజీ IAS అధికారి OP చౌదరి సీఎం పదవి రేసులో ఉన్నారు. ఈ మూడు రాష్ట్రాలకు బీజేపీ ఎవరిని సీఎంలుగా ఎంపిక చేస్తుంది అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
రాజస్థాన్‌లో మరో 'యోగి' వస్తారా? సీఎం రేసులో బాబా బాలక్‌నాథ్!
12 రాష్ట్రాల్లో బీజేపీ- 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్- పొలిటికల్ మ్యాప్‌ను మార్చేసిన సెమీఫైనల్!