బంగాల్లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అవినీతి ఆరోపణలతో మమతా బెనర్జీ సర్కార్ను భాజపా ఇరుకునపెడుతోంది. బంగాల్లో ప్రభుత్వం నీడలో వసూల్ రాజాలు చెలరేగిపోతున్నారని విమర్శించింది. అక్రమదందాలకు సంబంధించి మూడు ఆడియో టేపుల్ని విడుదల చేసింది.
ఓ సమావేశంలో కమిషనర్ ఎదురుగానే మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి సన్నిహితుడైన ఓ వ్యక్తి.. డబ్బులు ఇవ్వాలని వ్యాపారుల్ని, కొందరు వ్యక్తుల్ని బెదిరించినట్లు ఆడియో టేపులో ఉందని భాజపా ఆరోపించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా వీటిని బహిర్గతం చేశారు.
మమత ప్రభుత్వం బంగాల్ ప్రజల్ని అవమానించడమే కాక మోసం చేసిందని భాటియా విమర్శించారు. వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మమత సర్కార్ అండదండలతో ఈ అక్రమ వసూల్ రాజాలు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు.
అయితే ఈ ఆడియో టేపులపై ఇంతవరకు తృణమూల్ కాంగ్రెస్ స్పందించలేదు.
ఇదీ చదవండి: అభిషేక్ బెనర్జీ భార్యకు సీబీఐ నోటీసులు