ఉన్నావ్ బాధితురాలు ఆరోపణలతో .. ఉత్తర్‌ప్రదేశ్‌లో జులై 3న జరగనున్న జిల్లా పంచాయత్ ఛైర్మన్ పదవికి ప్రకటించిన తమ అభ్యర్థి అరుణ్ సింగ్‌ను భాజపా మార్చివేసింది. ఆ అభ్యర్థి, ఉన్నావ్ కేసులో శిక్షఅనుభవిస్తున్న మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు సన్నిహితుడని బాధితురాలు ఆరోపించింది. అంతే కాకుండా అతనితో తనకు ముప్పు ఉందని ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, యూపీ సీఎంకు లేఖలు పంపించింది. దీంతో పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
"నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామని భాజపా చెబుతూనే.. నా తండ్రిని చంపిన వారికి పదవులు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. కుల్దీప్ సింగ్‌కు ప్రభుత్వం ఇప్పటికీ మద్దతుగానే నిలుస్తోంది. అరుణ్ సింగ్‌కు పార్టీ టికెట్ ఇస్తే నా ప్రాణానికి ప్రమాదం ఉంటుంది. అరుణ్ సింగ్ స్థానంలో మరో అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నా."
-ఉన్నావ్ బాధితురాలి లేఖ
అరుణ్ సింగ్‌పై ఉన్నావ్ బాధితురాలు ఆరోపణలు నిరాధారమైనవని, ప్రతిపక్షాల కుట్రగా భాజపా జిల్లా అధ్యక్షుడు రాజ్ కిశోర్ రావత్ ఇటీవల ఆరోపించారు. కానీ పార్టీ నిర్ణయం మేరకు అరుణ్ సింగ్ నామినేషన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇదీ చదవండి: గుప్కార్ కూటమి నేతలతో ముగిసిన మోదీ భేటీ