Former Vice President Venkaiah Naidu On Tirumala laddu issue : తిరుమల శ్రీవారి ప్రసాదముల తయారీ విషయంలో వస్తున్న వార్తలు తనను ఎంతగానో కలచి వేశాయని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో ఈ విషయం గురించి ఫోన్‌లో మాట్లాడానని తెలిపారు. తిరుమల శ్రీవారు కోట్లాది భక్తుల ఇలవేల్పు, ఆ స్వామి ప్రసాదాన్ని ప్రతి భక్తుడు పరమ పవిత్రంగా స్వీకరించటం మాత్రమే కాదు, వారి ఆత్మీయులకు కూడా శ్రీవారి ఆశీస్సులు ఈ ప్రసాదం ద్వారా లభించాలని పంచడం మన పెద్దల నుంచి ఆచారంగా వస్తోందని ప్రస్తావించారు. తాజాగా వస్తున్న కథనాల నేపథ్యంలో ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
ఇంతటి ఆధ్యాత్మిక వైశిష్ట్యం ఉన్న తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో నాణ్యతతోపాటు పవిత్రత మరింత కీలకం అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అలాంటి పవిత్రతకు భంగం కలిగించే చిన్నపాటి దోషమైన క్షమార్హం కాదని స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో నిజా నిజాలు నిగ్గు తేల్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ముఖ్యమంత్రికి సూచించానని చెప్పారు. ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రిని కోరానని అన్నారు. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమ్మతించారని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
ఎంపీ రఘునందన్ రావు సీరియస్ : తిరుమల లడ్డులో జంతువుల కొవ్వును ఉపయోగించడం ద్వారా వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయడమేనని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఏ పరిపాలకులు చేయని అత్యంత ఖండనీయమైన చర్య అన్నారు. ఇది సనాతన ధర్మంపై విదేశీ ఆక్రమణదారులు చేసిన హేయమైన చర్యలను గుర్తు చేస్తుందని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. సరఫరాదారులు, టీటీడీ సిబ్బంది, బోర్డు సభ్యులతో సహా ఈ విషయంలో చిక్కుకున్న ప్రతి ఒక్కరినీ తక్షణమే అరెస్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అందరం కలిసి పోరాడాలి : తిరుమల లడ్డు అంశాన్ని అత్యాచారంగా బీజేపీ నేత మాధవి లత అభివర్ణించారు. దీనిపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలన్నారు. కేవలం లడ్డూ పైనే కాదు మొత్తం శ్రీవారి ఆస్తులపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. 100 రోజుల పాలనను పక్కదారి పట్టించేందుకే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారని జగన్ అంటున్నారు, ఇది మీ హయాంలో జరిగిన సంఘటనలు గురించి ఏం మాట్లాడతారని అన్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి ఇప్పటి జగన్ వరకు తిరుమలలో అన్య మతస్తులకు ఉద్యోగాలు ఇచ్చారని విమర్శించారు. అన్యమతస్తులను దేవాదాయ శాఖలో చేర్చడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని ధ్వజమెత్తారు. చంద్రబాబు సీఎం అయిన తరువాతనే ఒక్కొక్కటిగా ఎందుకు బయటకు వస్తున్నాయని ప్రశ్నించారు. ఈ విషయంపై అందరం కలిసి పోరాటం చేయాలని, నిజం బయటకు వచ్చే వరకు ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.