Jammu Kashmir LG Rights : జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేకాధికారాలు కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి జరుగుతున్న శాసనసభ ఎన్నికలు కేంద్ర పాలిత ప్రాంతానికి కీలకం కానున్నాయి. 2019 పునర్విభజన చట్టం ప్రకారం జమ్ముకశ్మీర్ రెండు కేంద్ర పాలితప్రాంతాలుగా మారింది. కొత్తగా ఏర్పాటు కానున్న జమ్మూకశ్మీర్ శాసనసభకు ఈ చట్టం ప్రకారం పరిమితమైన అధికారాలు మాత్రమే ఉంటాయి. గతంలో ఉన్న శాసనసభ మాదిరిగా కాకుండా లెఫ్టినెంట్ గవర్నర్ ఎక్కువ అధికారాలు కలిగి ఉంటారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
"ఎన్నికైన ప్రభుత్వానికి అధికారాలు తక్కువగా ఉంటాయి ఎందుకంటే పరిపాలనకు లెఫ్టినెంట్ గవర్నర్‌కు నాయకత్వం వహిస్తారు. ఆయనకే కార్యనిర్వాహక అధికారాలు ఉంటాయి. మరోవిధంగా చెప్పాలంటే, కేంద్ర పాలిత ప్రాంతంలోని ముఖ్యమంత్రికి తక్కువ అధికారాలు ఉంటాయి. ఎన్నికల తర్వాత ఏర్పాటయ్యే ఏ పార్టీ ప్రభుత్వానికైనా తక్కువ అధికారాలు ఉంటాయి. చట్టాలు చేయటానికి లేదా చట్టాలు మార్చటానికే కాకుండా చాలా అధికారాలు ఉపయోగించటానికి లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది"
-- సాదిక్ వహీద్, రాజకీయ విశ్లేషకుడు
కేంద్ర ప్రభుత్వం ద్వారా నియమితులైన లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్ర పాలితప్రాంత పాలనలో కీలకపాత్ర పోషించనున్నారు. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 53 ప్రకారం, బ్యూరోక్రసీ, అవినీతి నిరోధక విభాగాలపై ఆయనకే అధికారం ఉంటుంది. శాసనసభ నియంత్రణ లేకుండా స్వతంత్రంగా చర్యలు తీసుకోవచ్చు. సెక్షన్ 32 ప్రకారం పబ్లిక్ ఆర్డర్, పోలీస్ మినహా ఇతర అంశాలపై మాత్రమే కేంద్ర పాలితప్రాంత ప్రభుత్వాలు చట్టాలు చేయగలవు. అంతేకాకుండా సెక్షన్ 36 ప్రకారం ఆర్థిక బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టడానికి ముందుగా లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి పొందాల్సి ఉంటుంది.
"జమ్ముకశ్మీర్ పునర్విభజన చట్టం ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఎక్కువ అధికారాలు ఉంటాయి. సమాఖ్య దేశమైన భారత్‌లో పబ్లిక్ ఆర్డర్, పోలీస్ శాఖపై అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటాయి. ఆ అంశాల్లో కేంద్ర పాలితప్రాంత ప్రభుత్వానికి అధికారాలు ఉండవు. వాటిపై లెఫ్టినెంట్ గవర్నర్‌కే అధికారం ఉంటుంది. అడ్వకేట్ జనరల్, న్యాయ అధికారులను నియమించే విచక్షణాధికారం కూడా ఆయనకే ఉంటుంది. జమ్ముకశ్మీర్ శాసనసభలో ఆర్థికబిల్లులు ప్రవేశపెట్టాలన్నా ముందుగా లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి పొందాల్సి ఉంటుంది."
-- ప్రొఫెసర్ గుల్‌మహ్మద్ వానీ, రాజకీయ విశ్లేషకుడు
జమ్ముకశ్మీర్ పరిపాలన కేంద్ర పాలిత ప్రాంతాలైన దిల్లీ, పుదుచ్చేరి మాదిరిగానే ఉంటుంది. శాంతి భద్రతల అంశంపై ఎన్నికైన ప్రభుత్వానికి పరిమిత అధికారాలు మాత్రమే ఉంటాయి. దిల్లీ తరహాలోనే ఎన్నికైన ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య అధికారాల విభజన ఉంటుంది. అయితే లెఫ్టినెంట్ గవర్నర్‌కే ఎక్కువ అధికారాలు ఉంటాయి. ఒకవేళ జమ్ముకశ్మీర్‌లో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటైతే దిల్లీలో మాదిరిగా ఆప్ సర్కార్ ఎదుర్కొంటున్న సవాళ్లే ఇక్కడ కూడా ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.