Akkineni Nageswara Rao Negative Roles : సినీ ఇండస్ట్రీలో చాలా మంది నటులు కేవలం హీరో పాత్రలకే పరిమితం కాకుండా అప్పుడప్పుడు విలనిజం పండించేవారు. ఆ పాత్రల ద్వారా ప్రశంసలు కూడా పొందేవారు. అయితే నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మాత్రం ప్రతినాయకుడి పాత్ర పోషించేందుకు నిరాకరించేవారట. ఏఎన్నార్‌తో కలిసి నట ప్రయాణం సాగించిన దివంగత నటుడు సీనియర్ ఎన్టీఆర్ కూడా విలన్ పాత్రల్లో కనిపించారు. కృష్ణం రాజు, జగ్గయ్య, కాంతారావు, సీహెచ్ నారాయణ రావు, ఎల్వీ ప్రసాద్ ఇలా చాలా మంది నటులు రెండు పాత్రలూ ధరించారు. వారి కాలంలో మహిళల్లో కూడా కన్నాంబ, సావిత్రి, షావుకారు జానకి, అంజలీ దేవీ, భానుమతి, జమున, జి.వరలక్ష్మీ, ఎన్. వరలక్ష్మీలాంటి వారంతా ఇటు హీరోయిన్లుగానూ, అటు సెలక్టడ్ పాత్రల్లోనూ నటించారు.
సినీ జీవితంలో తీరిక లేకుండా గడిపిన అక్కినేని నాగేశ్వరరావు ఎంతమంది దర్శక,నిర్మాతలు ఎన్ని సార్లు అడిగినా, ఎన్ని రకాల కథలు విన్నా ప్రతినాయకుడి పాత్రలు మాత్రం అస్సలు చేయలేనని చెప్పేవారట. దీనికి కారణం ఏంటని అడిగితే "నా పర్సనాలిటీ, గొంతు నెగిటివ్ పాత్రలకు అస్సలు సరిపోవు" అని చెప్పేవారట. వాస్తవానికి రెండు రకాల పాత్రల్లో నటించడానికి కేవలం యాక్టింగ్ వస్తే సరిపోదు ముఖాకృతి, శరీరాకృతి, గొంతు కూడా విలన్ పాత్రకు సరిపోయేలా ఉండాలని ఆయన అభిప్రాయం.
ఇక ఏఎన్ఆర్ సినిమాల విషయానికొస్తే 1941లో బాలనటుడిగా ఆయన సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 1944లో 'సీతారామ జననం' చిత్రంలో తొలిసారి కథనాయకుడి పాత్రను పోషించారు. 1949 విడుదలైన 'కీలుగుర్రం' సినిమా అక్కినేనికి బ్రేక్ ఇచ్చిన చిత్రంగా చెబుతుంటారు. ఆ తర్వాత కెరీర్లో వెనుదిరగని ఆయన లవ్, యాక్షన్‌తో పాటు భక్తి సినిమాల్లో నటించి మెప్పించారు. అలనాటి అగ్రహీరోల జాబితాలో తన పేరును సుస్థిరం చేసుకున్నారు. సినిమాలపై ఆయనకున్న అభిమానం కారణంగా చివరి శ్వాస వరకూ నటిస్తూనే ఉన్నారు. 90ఏళ్ల వయసులోనూ కుమారుడు అక్కినేని నాగార్జున, మనవళ్లు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్‌లతో కలిసి 'మనం' సినిమాలో నటించారు. సినిమా తీస్తుండగానే 2014 జనవరి 22లో ఆయన కన్నుమూశారు.
ANR ఫిల్మ్ ఫెస్టివల్- థియేటర్లలో 'మిస్సమ్మ', 'మాయాబజార్' మూవీస్ - Nageswara Rao Birth Anniversary