గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా స్మారకార్థం ఝార్ఖండ్ (Jharkhand Birsa Munda) రాజధాని రాంచీలో ఏర్పాటు చేసిన మ్యూజియంను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవాలు జరుగుతున్న ఈ సమయంలో.. గిరిజన యోధుల సాహసాలు, వారి సంప్రదాయాలకు తగిన గుర్తింపు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. బిర్సా ముండా జయంతి (Birsa Munda jayanti) అయిన నవంబర్ 15ను ఇక నుంచి ఏటా 'జనజాతీయ గౌరవ్ దివస్'గా జరుపుకోనున్నట్లు ప్రధాని మోదీ (PM Mమోodi news) ప్రకటించారు.
"నా జీవితంలో చాలా వరకు గిరిజన సోదరసోదరీమణులు, గిరిజన చిన్నారులతోనే గడిపాను. వారి కష్టసుఖాలను దగ్గరుండి చూశాను. వారి జీవనవిధానం, వారి అవసరాలు అన్నీ నాకు తెలుసు. కాబట్టి వ్యక్తిగతంగా ఈరోజు నాకు చాలా ప్రత్యేకం. ఆజాదీకా అమృత్ మహోత్సవాలు జరుగుతున్న ఈ సమయంలో.. గిరిజన వీరులకు, వారి సంప్రదాయాలకు తగిన గుర్తింపు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందని దేశం భావిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని చారిత్రక నిర్ణయం తీసుకున్నాం. బిర్సా ముండా జయంతి అయిన నవంబర్ 15ను ఇక నుంచి ఏటా 'జనజాతీయ గౌరవ్ దివస్'గా నిర్వహించుకుందాం."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ దృఢ సంకల్పం వల్లే ఝార్ఖండ్ రాష్ట్రం ఆవిర్భవించిందని మోదీ పేర్కొన్నారు. గిరిజన వ్యవహారాల శాఖను ఏర్పాటు చేసింది కూడా ఆయనే అని గుర్తు చేశారు. ఝార్ఖండ్ ఆవిర్భావ దినోత్సవం (Jharkhand Foundation day) సందర్భంగా వాజ్పేయీకి సైతం నివాళులు అర్పిస్తున్నట్లు చెప్పారు.
సేవలు చిరస్మరణీయం
అంతకుముందు.. బిర్సా ముండా జయంతి సందర్భంగా (birsa munda birthday) ఆయన్ను స్మరించుకుంటూ ట్వీట్లు చేశారు మోదీ. గిరిజనుల హక్కులను కాపాడేందుకు ఆయన పోరాడారని అన్నారు. స్వాతంత్ర్య పోరాటానికి ప్రేరణగా నిలిచారని చెప్పారు. దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అదేసమయంలో, ఝార్ఖండ్ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మోదీ. రాష్ట్రానికి చారిత్రక గుర్తింపుతో పాటు, విశిష్ఠ సంస్కృతి ఉందని తెలిపారు.
24 ఏళ్లకే మృతి
అవిభాజ్య బిహార్లోని గిరిజన ప్రాంతంలో 1875లో బిర్సా ముండా (Birsa Munda biography) జన్మించారు. బ్రిటిష్ వలసపాలనకు వ్యతిరేకంగా గిరిజనులను ఏకం చేసి పోరాడారు. 1900 సంవత్సరంలో 24 ఏళ్ల వయసులోనే రాంచీ జైలులో మరణించారు.
ఇదీ చదవండి: తెల్లదొరలపై గిరిజన సమరభేరి- స్ఫూర్తినింపిన పోరాటాలు