బిహార్ పట్నాలో 63 ఏళ్ల ఓ మహిళకు ఒకేరోజు 15 నిమిషాల వ్యవధిలో రెండు వేర్వేరు టీకా డోసులు వేశారు వైద్య సిబ్బంది. మొదట కొవిషీల్డ్ టీకా డోసు అందించిన సిబ్బంది.. పావుగంట వ్యవధిలో కొవాగ్జిన్ డోసు వేశారు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెప్పిన అధికారులు.. ఆమెను వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు వెల్లడించారు. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
![Bihar woman gets two different doses](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12166672_865_12166672_1623936297869.png)
ఇదీ జరిగింది
కరోనా టీకా తీసుకునేందుకు సంగీత దేవి అనే మహిళ.. పట్నాలోని పున్‌పున్ బ్లాక్ పరిధిలోని బెల్దారిచాక్ మీడియం ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లింది. ఆధార్ కార్డు, ఫోన్ నంబరు సమర్పించింది. తర్వాత ఒకటో నంబరు టెబుల్ వద్ద ఉన్న సిబ్బంది మొదట డోసు వేశారు. తర్వాత మరో టెబుల్ వద్దకు వెళ్లాలని చెప్పారు. అక్కడ 15నిమిషాల తర్వాత వరుస నిల్చోమని చెప్పారు. ఆ సమయంలో ఒకేచేతికి రెండు డోసులు ఇస్తారా అని సిబ్బందిని సంగీత అడిగారు. దానికి అవును అని సమాధాం చెప్పారు. దీంతో రెండో టీకా వేసుకున్నారు సంగీత. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి, ఆందోళనకు దిగారు. ఇదంతా వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే జరిగిందని ఆరోపించారు. దీంతో ఆమెను వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.
అపార్థం కారణంగా ఈ పొరపాటు జరిగిందని.. ఆమె ఆరోగ్యాన్ని నిరంతరం వైద్యులు పర్యవేక్షిస్తున్నారని పున్‌పున్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇంఛార్జి డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. 14 రోజుల తర్వాత బాధితురాలికి యాంటీబాడీల పరీక్ష నిర్వహించి.. వచ్చిన ఫలితాల ఆధారంగా చికిత్స అందిస్తామని తెలిపారు.
ఈ ఘటనపై పట్నా జిల్లా మేజిస్ట్రేట్ చంద్ర శేఖర్ సింగ్తో ఫోన్లో సంభాషించింది ఈటీవీ భారత్. 'విషయం తన దృష్టికి వచ్చిందని.. సంబంధిత అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశాం. భవిష్యత్లో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం' అని చంద్రశేఖర్ తెలిపారు.
ఇదీ చూడండి: 'బాబా కా దాబా' యజమాని ఆత్మహత్యాయత్నం!