బిహార్ తూర్పు చంపారన్ జిల్లా మోతిహరి ప్రాంతంలో ఓ సంస్థకు చెందిన బిస్కెట్లకు అనుహ్యంగా గిరాకీ పెరిగింది. ఎన్నో కంపెనీల బిస్కెట్లు ఉన్నా.. అందరూ ఆ బ్రాండ్ బిస్కెట్ల కోసమే ఎగబడ్డారు. పోటాపోటీగా కొనుగోలు చేశారు. పిల్లలకు కీడు జరగకుండా ఉండాలంటే.. తల్లులు ఆ బిస్కెట్లు తినాలని వదంతులు వ్యాపించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
'ఎంతమంది కుమారులు ఉంటే.. మహిళలు అన్ని బిస్కెట్ల ప్యాకెట్లు తినాలి' అనే పుకారు.. సీతామడి, శివహర్ జిల్లాల్లోనూ పలు ప్రాంతాల్లో శరవేగంగా వ్యాపించింది. దీని గురించి తెలిసిన వెంటనే అందరూ దుకాణాల ముందు క్యూ కట్టారు. అది నిజమో, అబద్ధమో ఆలోచించకుండా.. బిస్కెట్ల కోసం ఎగబడ్డారు. దీంతో జిల్లాలో ఆ సంస్థకు చెందిన బిస్కెట్ల నిల్వలు అయిపోయాయి.
![Increased demand for biscuits](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/bh-mot-04-parle-g-visual-byte-thumbnail-bh10052_01102021230136_0110f_1633109496_253.jpg)
"ఈ వదంతులు వ్యాపించడం హాస్యాస్పదంగా ఉంది. బిస్కెట్లు కొనడానికి ప్రజలు భారీగా ఎగబడ్డారు. ఇంతకుముందు సేల్స్ మామూలుగానే ఉండేవి. అయితే పుకార్ల తర్వాత వాటికి బాగా గిరాకీ పెరిగింది" అని ఓ దుకాణదారుడు తెలిపాడు.
![Increased demand for biscuits](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/bh-mot-04-parle-g-visual-byte-thumbnail-bh10052_01102021230136_0110f_1633109496_237.jpg)
బిస్కెట్లు అడిగిన శిశువు!
"ఇటీవల ఓ మహిళ.. బిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువు పుట్టగానే.. ఓ కంపెనీకు చెందిన బిస్కెట్లు కావాలని అడిగాడు. వాటిని తిన్నాడు. దీంతో పుత్రులు ఉన్న ప్రతి మహిళ.. ఎంత మంది కుమారులు ఉంటే అన్ని బిస్కెట్ ప్యాకెట్లు తినాలి. లేకపోతే వారి కుమారుడికి కీడు జరుగుతుంది" అన్న వదంతులు బాగా వ్యాపించాయని ఆ దుకాణాదారుడు పేర్కొన్నాడు.
![Increased demand for biscuits](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13236155_image.jpg)
జితియా వ్రతం..
బిహార్, ఝార్ఖండ్, బంగాల్ ప్రాంతాల్లోని హిందువులు ప్రతి సంవత్సరం.. 'జితియా వ్రతాన్ని' జరుపుకుంటారు. దీనినే 'జీవిత్ పుత్రికా వ్రత్' అని కూడా పిలుస్తారు. సెప్టెంబరు నెలాఖరులో జరుగుతుంది. జితియా వ్రతం రోజుల్లో తల్లులు ఉపవాసం ఉంటారు. మంచి నీళ్లు కూడా తాగరు. తమ బిడ్డలు దీర్ఘాయువుతో ఉండాలని, సుఖసంతోషాలతో జీవించాలని దేవుడికి పూజలు చేస్తారు. ఇది ఏటా జరిగేదే. అయితే ఈసారి మాత్రం ఓ విచిత్ర పుకారు అంతటా వ్యాపించింది. ఫలితంగా మహిళలు ఎడాపెడా బిస్కెట్లు కొన్నారు.
ఇదీ చూడండి: దారుణం.. ఆరేళ్ల బాలుడ్ని సుత్తితో కొట్టి చంపిన బంధువులు