Bihar court 108 years: మూడు ఎకరాల భూమి కోసం రెండు కుటుంబాల మధ్య 108 ఏళ్లు సాగిన వివాదానికి... బిహార్‌లోని ఓ కోర్టు ఎట్టకేలకు తెరదించింది. భూమిని కొనుగోలు చేశామని చెబుతున్న అతుల్ సింగ్ కుటుంబానికే ఆ ఆస్తి చెందుతుందని భోజ్‌పుర్ జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. ఇన్నేళ్లుగా ప్రభుత్వం అధీనంలో ఉన్న ఆ భూమిని విడిపించుకునేందుకు.. పిటిషన్ దాఖలు చేసిన వారి వారసులకు అనుమతి ఇచ్చింది.
1914లో మొదలు: వివాదాస్పద భూమి కొయిల్వార్ నగర్ పంచాయతీ పరిధిలో ఉంది. నాథుని ఖాన్ అనే వ్యక్తి నుంచి అతుల్ సింగ్ ముత్తాత దర్బారీ సింగ్ ఆ భూమిని కొనుగోలు చేశారు. 1911లో నాథుని ఖాన్ మరణించాక సమస్య మొదలైంది. ఖాన్ ఆస్తులపై తమకే యాజమాన్య హక్కు ఉంటుందంటూ అతడి కుటుంబసభ్యులు తమలో తామే గొడవపడ్డారు. ఫలితంగా.. ఖాన్‌కు చెందిన 9 ఎకరాల ఎస్టేట్‌లో భాగమైన ఈ మూడెకరాలపైనా వివాదం నెలకొంది. ఫలితంగా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆ ఆస్తిని జప్తు చేసింది.
దర్బారీ సింగ్ 1914లో న్యాయపోరాటం ప్రారంభించారు. ఆ భూమిని తాను చట్టబద్ధంగా కొనుగోలు చేశానని, తనకే దక్కాలని చూడాలని కోరారు. దర్బారీ సింగ్ తరఫున అప్పట్లో న్యాయవాది శివ్రథ్ నారాయణ్ సింగ్ కోర్టులో వాదనలు వినిపించారు. ఆ తర్వాత పిటిషనర్, న్యాయవాది ఇద్దరూ మరణించారు. వారి వారసులు న్యాయపోరాటం కొనసాగించారు. శివ్రథ్ కుమారుడు భద్రీ నారాయణ్ సింగ్ కేసు బాధ్యతలు తీసుకున్నారు. అయినా ఫలితం లేదు. చివరకు.. ఆయన కుమారుడు సతేంద్ర సింగ్ ఈ కేసును ఓ కొలిక్కి తీసుకొచ్చారు. అతుల్ సింగ్‌కు న్యాయం జరిగేలా చేశారు.
"జడ్జి శ్వేతా సింగ్ ఓపికను మెచ్చుకోవాలి. ఈ కేసుకు సంబంధించిన దస్త్రాలను పరుగులు తినేశాయి. అయినా ఆమె జాగ్రత్తగా వాటిని పరిశీలించారు. మార్చి 11న తీర్పు ఇచ్చారు. నా క్లయింట్ అతుల్ సింగ్.. తహసీల్దార్‌ను కలిసి భూమిని విడిపించుకోవచ్చని స్పష్టం చేశారు. ఇది ఒక అసాధారణ కేసు. నాథుని సింగ్ కుటుంబసభ్యులు ఎవరూ ఇప్పుడు ఇక్కడ లేరు. దేశ విభజన సమయంలో వారు పాకిస్థాన్ వెళ్లిపోయారు. మా క్లయింట్లు ఈ కేసును నాలుగు తరాలు పోరాడారు. ఈ కేసును ఓ కొలిక్కి తీసుకురావడం సంతృప్తిని ఇచ్చింది." అని చెప్పారు న్యాయవాది సతేంద్ర సింగ్.