Bhiwani mining: హరియాణా భివానీ జిల్లా దదమ్ గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది. మైనింగ్ కార్యకలాపాలు జరుగుతుండగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు నలుగురు మరణించినట్లు రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్ ప్రకటించారు. శిథిలాల కింద పలువురు ఉన్నట్లు సమాచారం. పదుల సంఖ్యలో క్రేన్లు, డంపర్లు కూడా ధ్వంసమయ్యాయి. ఉదయం 8:15 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
జిల్లా యంత్రాంగంతో ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్.
అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఎంత మంది శిథిలాల కింద ఉన్నారనే విషయంపై మాత్రం స్పష్టత లేదు.
Bhiwani news
మైనింగ్ పనులు జరుగుతుండగా భారీ కొండకు పగుళ్లు వచ్చి ఈ ప్రమాదం సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రాళ్ల పెళ్లలు కుప్పలుకుప్పలుగా మీదపడినట్లు పేర్కొన్నారు. వాటి కింద మనుషులతో పాటు పెద్ద పెద్ద వాహనాలు చిక్కుకున్నట్లు వివరించారు.
కాలుష్యం కారణంగా ఈ ప్రాంతంలో మైనింగ్ కార్యకలాపాలను చాలా కాలం క్రితమే నిలిపివేశారు. అయితే రెండు రోజుల క్రితమే ఇక్కడ విద్యుత్ సరఫరాకు అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో మళ్లీ పనులు మొదలవ్వగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ మైనింగ్ నిలిపివేయాలని ప్రజలు కూడా నిరసనలు చేసినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై క్రషర్ అసోసియేషన్ ఛైర్మన్ సత్బీర్ రతేరా స్పందించారు. ఘటన జరిగి సమయంలో మైనింగ్ పనులు జరగడం లేదని పేర్కొన్నారు. ఈ ప్రాంతం రెండు వైపులా అడవి ఉందన్నారు. కొండప్రాంతం మైనింగ్ పరిధిలో ఉందన్నారు. ఈ ఘటనలో శిథిలాల్లో చిక్కుకున్న ముగ్గురిని కాపాడామని, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని, ఒక్కరు మరణించారని రతేరా తెలిపారు.
ఘటనా స్థలాన్ని హరియాణా వ్యవసాయ శాఖ జేపీ దలాల్ సందర్శించారు. పలువురు మరణించారని చెప్పారు. అయితే ఎంతమందో కచ్చితంగా చెప్పలేమన్నారు. వైద్య బృందం సాయంతో వీలైనన్ని ప్రాణాలు కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామన్నారు.