దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. రోజూవారీ కేసులు 4లక్షలకు చేరువవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అటు మరణాలు సైతం ఎన్నడూ లేని విధంగా అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. మధ్యప్రదేశ్ భోపాల్లో కరోనా మరణాలపై అధ్యయనం చేసిన పీటీఐ వార్తాసంస్థ విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. భోపాల్లో ఒక్క ఏప్రిల్ నెలలోనే 2,557 కొవిడ్ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించామని శ్మశానవాటికల యాజమాన్యం వివరిస్తోంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం.. కేవలం 104 మంది మాత్రమే వైరస్ కారణంగా మృతిచెందారని ప్రకటించింది.
ఇరు వర్గాల మధ్య ఇంత భారీ తేడా ఉండటంపై.. కానరాని కొవిడ్ మరణాలు చాలానే ఉన్నాయన్న సందేహం ఉత్పన్నమవుతోంది. మధ్యప్రదేశ్ భోపాల్ లోని రెండు శ్మశాన వాటికల నిర్వాహకులతో మాట్లాడిన పీటీఐ వార్తాసంస్థ.. విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. గత నెలలో మొత్తం 3,881 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించామని శ్మశానవాటికల యాజమాన్యం తెలిపింది. వాటిలో 2,557 మంది కరోనాతో మరణించినవారేనని పేర్కొంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 742.
" గత నెలలో మొత్తం 1386 మృతదేహాలను ఖననం చేశాం. అందులో 727 మంది వైరస్ తో మృతి చెందిన వారే."
-- శోభరాజ్ శుఖవాని, సుభాష్ నగర్ ఘాట్ మేనేజర్.
అయితే.. ప్రభుత్వం కొవిడ్ మరణాలను దాస్తోందంటూ వస్తున్న వార్తలను మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఖండించారు. వీటిలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : 'మాకు ఆక్సిజన్ అందకపోతే.. పెను విషాదమే'