జూమ్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ శ్రేయస్కరం కాదని హెచ్చరింది కేంద్ర ప్రభుత్వం. భద్రతాపరంగా సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున ఈ యాప్‌ను అధికారిక ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని హోం మంత్రిత్వ శాఖ సూచించింది.
ఈ మేరకు పలు మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్ర హోంశాఖ. ఇటీవల కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం(సెర్ట్-ఇన్) జారీ చేసిన హెచ్చరికను మార్గదర్శకాల్లో ఉద్ఘాటించింది.
దేశంలో కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా లాక్డౌన్ ప్రకటించగా.. చాలా మంది ఇంటి నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సమయాల్లో సమావేశాలు నిర్వహించేందుకు జూమ్ యాప్‌ను వినియోగిస్తున్నారు. అయితే ఈ ప్లాట్‌ఫాంలో భద్రత లేదని స్పష్టం చేసింది కేంద్రం. ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా ఇప్పటికీ జూమ్‌ను వినియోగించాలని అనుకుంటే ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించాలని సూచించింది.