ప్రేమించిన వారు కాదన్నారంటూ బలవన్మరణాలకు పాల్పడుతోంది యువత. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయితో పరిచయం ఏర్పడిన ఓ యువకుడు.. తన ప్రేమను ఒప్పుకోలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె ఎలా ఉంటుందో కూడా తెలియకుండానే మనసిచ్చి తనువు చాలించాడు. తమిళనాడు సేలం జిల్లాలో జరిగిందీ ఘటన.
వివరాల్లోకి వెళ్తే...
సేలం జిల్లాకు చెందిన ఆనంద్‌కుమార్(23) ప్రైవేటు బ్యాంకు ఏటీఎంలో డబ్బులు నింపే ఉద్యోగం చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడం వల్ల రెండు నెలల నుంచి ట్రిచీలోని తన బంధువుల ఇంట్లోనే చిక్కుకుపోయాడు.
ఆ సమయంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. అంతే ముఖం కూడా చూడకుండా ప్రేమలో పడ్డాడు. కొద్ది రోజులపాటు సంభాషణలు జరిగిన తర్వాత.. మహిళ ఆనంద్ ప్రేమను తిరస్కరించి, తన ఇన్‌స్టా ఖాతానూ తొలగించింది. ఈ ఘటనతో కుంగిపోయిన ఆనంద్‌కుమార్‌ను అతని బంధువులు ఓదార్చారు.
ఉరి వేసుకొని...
తన ప్రేమను కాదన్నందుకు తట్టుకోలేక బంధువుల ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఆనంద్. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తువకుడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అసలు ఆనంద్‌కుమార్ ప్రేమించిన వ్యక్తి అమ్మాయేనా లేక అబ్బాయి అయి ఉంటాడా అనే కోణంలో విచారిస్తున్నారు.