కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ... కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌పై విమర్శలు గుప్పించారు. నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీపై గోయల్ చేసిన వ్యాఖ్యలను ప్రియాంక తప్పుబట్టారు. ప్రభుత్వం పని కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే కానీ.. కామెడీ సర్కస్‌ను నడపడం కాదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇటీవల ఓ కార్యక్రమంలో గోయల్ మాట్లాడుతూ.. అభిజిత్ బెనర్జీ కాంగ్రెస్ ప్రతిపాదించిన కనీస ఆదాయ పథకం 'న్యాయ్'కు మద్దతు తెలిపారని పేర్కొన్నారు. అయితే దేశ ప్రజలు దానిని సున్నితంగా తిరస్కరించారని.. అందువల్ల ఆయన చెప్పిన మాటలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. బెనర్జీని వామపక్ష వాదిగా గోయల్ అభివర్ణించారు.
ఈ వ్యాఖ్యలపై ప్రియాంక స్పందిస్తూ... భాజపా నాయకులు వారి పని చేయకుండా.. ఇతరులు సాధించిన విజయాలను తప్పుబడుతున్నారని ఆరోపించారు. బెనర్జీ నిజాయతీగా పని చేసి.. నోబెల్ దక్కించుకున్నారని ప్రియాంక ట్వీట్ చేశారు.
భారత సంతతికి చెందిన అమెరికన్ అభిజిత్ బెనర్జీకి.. ఆర్థిక శాస్త్రంలో 2019కి గాను ఇటీవల నోబెల్ పురస్కారం దక్కింది.
ఇదీ చూడండి: 'అసెంబ్లీ పోరు': ముగిసిన ప్రచార పర్వం.. 21న ఎన్నికలు