వయసు 21 ఏళ్లే. మోసాల్లో మాత్రం ఘనుడు. టార్గెట్ చేసింది సామాన్యులను కాదు... ఏకంగా కేంద్ర మంత్రిత్వశాఖలను. రూ.4 కోట్లు కొట్టేశాడు. అరెస్టయి... బెయిల్పై వచ్చినా బుద్ధి మారలేదు. మరో కుట్ర పన్నాడు. అది కాస్తా బెడిసికొట్టింది. ఫలితంగా ఇప్పుడతడు మరోమారు కటాకటాలు లెక్కపెడుతున్నాడు.
ఇదీ జరిగింది
కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు లలిత్ దాగర్ పేరుతో ఓ మెయిల్ వచ్చింది. చెన్నైలోని కార్మిక శాఖలో పే అండ్ అకౌంట్స్ అధికారిగా ఎంపికయ్యానని, తనకు ఉద్యోగి యూజర్ ఐడీ, తదితరాలను అందివ్వాలని కోరాడు. ధ్రువీకరణ కోసం చరవాణి సంఖ్య, రెండు పత్రాలను పంపాడు. అందులో ఒకటి నకిలీ నియామక పత్రం.
కార్మిక శాఖ అధికారులకు అనుమానం వచ్చింది. రికార్డులన్నీ సరిచూశారు. లలిత్ దాగర్ పేరుతో ఎలాంటి అధికారి నియామకం జరగలేదని గుర్తించారు. దిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. నిందితుడు అసోంకు చెందిన 21 ఏళ్ల నూర్ మహ్మద్ అలీగా గుర్తించారు. అసోం వెళ్లి అతడ్ని అరెస్టు చేశారు.
అంతకుముందే...
అలీపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. వివిధ మంత్రిత్వ శాఖలే లక్ష్యంగా మోసానికి పాల్పడుతూ రూ. 4 కోట్లు కొట్టేశాడని అభియోగాలు ఉన్నాయి. నకిలీ ఉద్యోగ పత్రాలతో సంపాదించిన యూజర్ ఐడీతో ఆ మంత్రిత్వ శాఖలోకి లాగిన్ అయ్యేవాడు. అతడి ఖాతాల్లోకి నగదు బదిలీ చేసేవాడు. ఇలాంటి ఓ కేసులో ఇంతకుముందే అరెస్టయ్యాడు అలీ. ఇటీవలే బయటకు వచ్చాడు. వచ్చీ రాగానే కార్మిక శాఖను మోసగించేందుకు విఫలయత్నం చేసి... మళ్లీ బుక్కయ్యాడు.
ఇదీ చూడండి: వైరల్: తుపాకులతో భాజపా ఎమ్మెల్యే గానాభజానా