కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లా కడబా తాలూకా నెల్యాడీలో నివాసం ఉండే పరీక్షిత్.. నలుపు, తెలుపు రంగు కాగితాలు, ఓ బ్లేడు సహాయంతో చూడచక్కని చిత్రాలను తయారు చేస్తున్నాడు. ముచ్చటైన చిత్తరువులను రూపొందించడమే కాక ప్రపంచ రికార్డులను నెలకొల్పుతున్నాడు.
ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటాన్ని రూపొందించాడు పరీక్షిత్. కేవలం 3 నిమిషాల 12 సెకన్ల వ్యవధిలోనే ఈ కళాఖండాన్ని సృష్టించి 'ఎక్స్క్లూజివ్ వరల్డ్ రికార్డ్స్'లో స్థానం సంపాదించాడు.
ఇదీ కళ...
సాధారణంగా బొమ్మలు గీసేందుకు పెన్సిళ్లు, స్కెచ్లు, పెయింట్ బ్రష్లు వాడతారు. పరీక్షిత్ కళ మాత్రం ఇందుకు భిన్నం. బోర్డుపై నల్ల రంగు కాగితం, దానిపై తెల్ల కాగితం ఉంచుతాడు. తనకు కావాల్సిన బొమ్మకు తగినట్లు బ్లేడుతో తెల్ల కాగితాన్ని కత్తిరించి, నల్ల కాగితం కనిపించేలా చేస్తాడు. అలా మోదీ వంటి ప్రముఖులు, ఇతర చిత్రాలను రూపొందిస్తాడు.
మంగళూరు శక్తినగర్ డిజైన్ సెంటర్లోని ప్రముఖ ఆర్ట్ టీచర్ గోపాద్కార్ వద్ద ఈ చిత్రకళను అభ్యసించాడు పరీక్షిత్.