ఇషానా... తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన 18 ఏళ్ల యువతి. యువ పారిశ్రామికవేత్తగా ఎదిగి.. తనతో పాటు 15 మంది మహిళలకు ఉపాధి కల్పించే స్థాయికి చేరింది.
పాఠశాలకు వెళ్లే రోజుల్లోనే 6 నెలలపాటు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు అభ్యసించింది ఇషానా. మహిళలకు ఉపయోగపడేలా, పర్యావరణహితమైన పునర్వినియోగ కాటన్ శానిటరీ ప్యాడ్లను తయారు చేయాలని ఆమెకు ఓ ఆలోచన వచ్చింది. చుట్టుపక్కల మహిళలు ఆమె ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు. ఇషానాతో కలిసి ఈ నాప్కిన్లను తయారు చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆమె వద్ద 15 మంది మహిళలు పని చేస్తున్నారు.
"ఈ క్లాత్ ప్యాడ్‌ను ముందు నేను వినియోగించాను. మిగిలినవారి కోసమూ తయారు చేస్తే వారికి ఇది ఉపయోగపడుతుంది అనిపించింది. మిషన్‌పై కుట్టడం మొదలుపెట్టాను. ఈ పని చేయడం సంతృప్తినిచ్చింది. ఒక అమ్మాయి ఓ సంవత్సరానికి 60-70 సాధారణ ప్యాడ్లను వినియోగిస్తుంది. ఈ పునర్వినియోగ ప్యాడ్లు అయితే ఏడాదికి 6 సరిపోతాయి."
-ఇషానా, కాటన్ ప్యాడ్ సృష్టికర్త
కాటన్ ప్యాడ్ల పరిశ్రమను మరింత విస్తరించాలని భావిస్తోంది ఇషానా. ఇందుకోసం కార్పొరేట్ సంస్థలను కలిసేందుకు ప్రయత్నిస్తోంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) కింద వారి నుంచి ఆర్థిక సాయం పొందాలన్నది ఇషానా ఆలోచన.
ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టాలని ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు... ప్లాస్టిక్‌తో తయారు చేసిన శానిటరీ నాప్కిన్లను విడనాడాలని ఇషానా కోరుతోంది.
- ఇదీ చూడండి: ఐదు పైసలకే.. ఒకటిన్నర ప్లేట్ చికెన్ బిర్యానీ!