14 నెలల కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలడం వల్ల కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై భారతీయ జనతాపార్టీ దృష్టి పెట్టింది. భాజపా అధ్యక్షుడు అమిత్ షా కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుందని రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతలతో చర్చించారు.
మరోవైపు కుమారస్వామి రాజీనామా తర్వాత బెంగళూరులో భాజపా శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించిన భాజపా ఎమ్మెల్యేలు..అధిష్ఠానం ఆదేశాల మేరకు నడుచుకోవాలని నిర్ణయించారు. ఈ ఉదయం 11 గంటలకు మరోసారి భాజపా శాసనసభాపక్షం సమావేశం కానుంది.
"ప్రభుత్వ ఏర్పాటుపై మేము ప్రధాని మోదీ, జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో చర్చిస్తాం. ఆ తర్వాతే నేను వెళ్లి గవర్నర్‌ను కలుస్తాను. మా అధ్యక్షుడిని అడుగుతాను.. కలవమని పిలిస్తే వెంటనే దిల్లీ వెళతాను. ఇక్కడే ఉండి గవర్నర్‌ను కలవమంటే వెళ్లి కలుస్తాను." - యడ్యూరప్ప, భాజపా కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు
ఇదీ సంగతి..
కాంగ్రెస్- జేడీఎస్ కూటమి ప్రభుత్వం విధానసభలో జరిగిన విశ్వాసపరీక్షలో ఓడిపోవడం వల్ల ముఖ్యమంత్రి పదవికి కుమారస్వామి రాజీనామా చేశారు. విశ్వాస పరీక్ష సందర్భంగా సభకు 204 మంది ఎమ్మెల్యేలు హాజరుకాగా బలనిరూపణకు103 మంది సభ్యుల మద్దతు అవసరమైంది. 99 మంది మాత్రమే ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. వ్యతిరేకంగా 105 మంది ఓటు వేశారు. వెంటనే కుమారస్వామి గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖ అందించారు. కుమారస్వామి రాజీనామా చేసిన వెంటనే కర్ణాటక వ్యాప్తంగా భాజపా నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
- ఇదీ చూడండి: ఆ ఫలితాలే కూటమి పతనానికి బాటలు!