కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ఎట్టకేలకు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. 17 మందికి తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. ప్రభుత్వం కొలువుదీరి మూడు వారాలు గడచిన తరువాత ఆయన మంత్రివర్గాన్ని విస్తరించడం విశేషం.
నూతన మంత్రులు.. ప్రమాణస్వీకారం
కర్ణాటక రాజ్భవన్లో గవర్నర్ వాజూభాయ్వాలా నూతన మంత్రులతో ప్రమాణం చేయించారు. మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రులు కేఎస్ ఈశ్వరప్ప, ఆర్ అశోక, స్వతంత్ర శాసనసభ్యుడు హెచ్ నగేశ్, ఎమ్మెల్సీ కోట శ్రీనివాస పూజారి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
శాసనసభ, శాసన మండలి రెండింటిలోనూ సభ్యుడు కాని లక్ష్మణ్ సంగప్ప సావాడిని యడియూరప్ప తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు.
వీరు కూడా..
గోవింద్ ఎమ్ కరాజోల్, అశ్వత్ నారాయణ్ సీఎన్, బి శ్రీరాములు, ఎస్ సురేష్ కుమార్, వి సోమన్న, సీటీ రవి, బసవరాజ్ బొమ్మయ్, జేసీ మధుస్వామి, సీసీ పాటిల్, ప్రభు చౌహాన్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. యడియూరప్ప తన కేబినెట్లో ఒకే ఒక మహిళకు చోటు కల్పించారు. ఆమె... శశికళ జోల్లె అన్నాసాహెబ్.
కర్ణాటక ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో సహా గరిష్ఠంగా 34 మంది మంత్రులు ఉండవచ్చు.
ఇదీ చూడండి: 'అయోధ్యలో ఆలయం స్థానంలో మసీదు నిర్మించారు'