స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా.. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు నేటికీ సాగు, తాగు నీటికి అవస్థలు పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఇండో- భూటాన్ సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలు నీటి కోసం అనేక కష్టాలు పడుతున్నారు. అసోం సరిహద్దులోని బక్సా, చిరాంగ్, ఉదళ్గురి జిల్లా వాసులు నీటికోసం పొరుగు దేశం- భూటాన్ మీద ఆధారపడ జీవనం సాగించాల్సిన పరిస్థితి నెలకొంది.
'డాంగ్' ద్వారా..
సుమారు ఒకటిన్నర లక్షల మందికిపైగా రైతులు సరిహద్దు గ్రామాల్లో నివసిస్తుండగా.. వారంతా భూటాన్ నదులనే నమ్ముకొని బతుకీడుస్తున్నారు. ఇందుకోసం గుంటలను తవ్వి.. నదుల ద్వారా వచ్చే నీటిని నిల్వ చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఆ నీటిని పంట పొలాలకు వినియోగిస్తారు. ఈ సంప్రదాయ పద్ధతినే అక్కడ 'డాంగ్' అని పిలుస్తారు.
అందుకే నిరసన..
అయితే.. దిగువకు వచ్చే నీటిని మళ్లించారని ఆరోపిస్తూ పొరుగు దేశం అధికారులపై ఈ నెల 22న నిరసనకు దిగారు స్థానికులు. ఈ ఆందోళనలను అసోం రాష్ట్ర సర్కారు, భూటాన్ ప్రభుత్వం ఖండించాయి. ఈ నిరసనలను ఉద్దేశ పూర్వకమైనవిగా పరిగణించాయి. ఈ విషయమై అసోం ప్రధాన కార్యదర్శి(సీఎస్) కుమార్ సంజయ్ కృష్ణ స్పందించారు. భూటాన్ నుంచి అసోంలోని దిగువ ప్రాంతాలకు నీటిని తరలించడంపై కొంత సహజ ప్రతిష్టంభన నెలకొందన్నారు.
లాక్డౌన్ కారణంగా భూటాన్ ప్రభుత్వం.. సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలకు నీటి సరఫరాను నిరాకరించిందని బీటీఏ మాజీ సభ్యుడు ధర్మ నారాయణ దాస్ చెప్పారు.
'సరిహద్దు ప్రాంతాల్లో నీటి వనరులకు కారణమైన కాలువలు వర్షాకాలంలో తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. అందుకే నీటి ప్రవాహంపై ఆ ప్రభావం పడకుండా జాగ్రత్త వహించాం. వీటిపై భారత ప్రభుత్వం దౌత్య స్థాయిలో చర్యలు చేపడుతుందని భావిస్తున్నా.'
-ధర్మ నారాయణ దాస్, బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్(బీటీఏ) మాజీ సభ్యుడు
శతాబ్దాల నుంచి..
భారత్, భూటాన్ల మధ్య శతాబ్దాల తరబడి సహాయ సహకారాలు కొనసాగుతున్నాయి. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సహా ప్రస్తుత భాజపా ప్రభుత్వం ఆ దేశానికి జల విద్యుత్ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు వీలుగా ఆర్థికంగా సాయం అందిస్తున్నాయి.
ఇదీ చదవండి: ప్రధాని పదవికే వన్నె తెచ్చిన 'పీవీ'