కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది? ఎలా ఆవిర్భవించింది? వైరస్ వ్యాప్తికి మూలం ఏమిటి? ఇప్పటికీ సరైన సమాధానాలు దొరకని ప్రశ్నలివి. అయితే ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా మహమ్మారి వుహాన్ ల్యాబ్‌లోనే పుట్టిందని అమెరికా తీవ్రంగా ఆరోపిస్తోంది. మిగతా దేశాలు కూడా ఇవే అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి.
ఈ ఆరోపణలకు ఓ కారణమూ ఉంది. గబ్బిలాల సంరక్షణపై అమెరికా, చైనా, భారత్‌కు చెందిన వైరాలజీ (వైరస్, వాటి వల్ల కలిగే వ్యాధుల శాస్త్రము) శాస్త్రవేత్తల బృందం 2017లో పరిశోధనలు చేసింది. గబ్బిలాల్లో కరోనా వైరస్ల పుట్టుకతో పాటు వాటి వ్యాప్తి, వ్యాక్సిన్ అభివృద్ధి వంటి అంశాలపై పరిశోధించారు. ఇందుకోసం నాగాలాండ్‌లోని ఓ మారుమూల గ్రామాన్ని ఎంచుకున్నారు. అక్కడ ఎన్నో ఏళ్లుగా గబ్బిలాల సంరక్షణ చూసుకుంటున్న ఓ నిర్దిష్ట తెగలోని ఏడుతరాలకు చెందిన 85 మంది నాగాల రక్త నమూనాలను సేకరించారు. ఆ శాంపిల్స్‌పై పరిశోధనలు చేసిన చేసిన జర్నల్ను.. 2019 అక్టోబర్ 31న పీఎల్ఓఎస్ ప్రచురించింది.
'బ్యాట్ ఉమన్'
ఈ శాస్త్రవేత్తల బృందంలో వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన షి జింగ్లీ, జింగ్లూ యాంగ్‌లు కూడా ఉన్నారు. సార్స్ లాంటి కరోనా వైరస్ పరిశోధనల్లో జింగ్లీ నిష్ణాతులు. అందుకే ఈమెను చైనా 'బ్యాట్ ఉమన్' అని కూడా పిలుస్తారు. సెంటర్ ఫర్ ఎమర్జింగ్ ఇన్ఫెక్షియస్ డిసీసెస్ డైరెక్టర్ బాధ్యతలూ జింగ్లీనే నిర్వహిస్తున్నారు. అయితే యాదృచ్ఛికంగా గతేడాదే కరోనా వైరస్ వుహాన్‌లో పుట్టడం, అది కాస్తా ప్రపంచ దేశాలకు సంక్రమించి లక్షలాది ప్రాణాలు బలితీసుకుంది. ఈ నేపథ్యంలో కొవిడ్-19 వుహాన్ ల్యాబ్‌లోనే పుట్టి ఉంటుందని కొందరు శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. అమెరికా సైతం ఇవే ఆరోపణలు చేస్తోంది.
నిధులు సమకూర్చింది అమెరికానే
ఇందులో మరో విశేషమేంటంటే.. ఈ పరిశోధనకు అమెరికాకు చెందిన యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్, ది డిఫెన్స్ థ్రెట్ రిడక్షన్ ఏజెన్సీ (డీటీఆర్ఏ), బయోలాజికల్ డిఫెన్స్ రీసెర్చ్ డైరెక్టరేట్ ఆఫ్ ది నావల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్లు నిధులు సమకూర్చాయి.