భారత్ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నాలుగు దేశీయ ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంక్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా సుమారు 800 మిలియన్ డాలర్ల(భారత కరెన్సీలో సుమారు 5,800 కోట్ల రూపాయలు)ను విడుదల చేయనుంది. ఫలితంగా.. ఛత్తీస్‌గఢ్ ఇన్‌క్లూజివ్ రూరల్ అండ్ అసిలరేటెడ్ అగ్రికల్చరల్ గ్రోత్(చిరాగ్), నాగాలాండ్‌లోని ఎన్హాన్సింగ్ క్లాస్రూమ్ టీచింగ్ రిసోర్సెస్, సెకండ్ డ్యామ్ ఇంప్రూవ్మెంట్ అండ్ రిహాబిలిటేషన్(డ్రిప్-2) వంటి ప్రధాన ప్రాజెక్ట్‌లకు ప్రపంచ బ్యాంక్ నుంచి నిధులు సమకూరనున్నాయి.
దేశంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు ఈ ప్రాజెక్టులు ఉపయోగకరంగా ఉన్నాయని ప్రపంచ బ్యాంక్ అభిప్రాయపడింది. దీంతో దేశీయ సామాజిక రక్షణ నిర్మాణాన్ని బలోపేతం చేయడం సహా.. ఛత్తీస్‌గఢ్‌లో గిరిజన వ్యవసాయాన్ని పోత్సహించవచ్చని, నాగాలాండ్ ప్రజలకు నాణ్యమైన విద్యనందించవచ్చని తెలిపింది. అంతేకాకుండా దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలలో ఉన్న ఆనకట్టల భద్రత, వాటి పనితీరును మెరుగుపరచడం వంటివి ఇందులో భాగమని పేర్కొంది.
ఈ నాలుగు ప్రాజెక్టుల ద్వారా దేశంలో సుస్థిర ఆర్థిక వ్యవస్థను నెలకొల్పవచ్చని ప్రపంచ బ్యాంక్ ఇండియా డైరెక్టర్ జునైద్ అహ్మద్ అన్నారు. కరోనా మహమ్మారి ద్వారా దెబ్బతిన్న పేద, బలహీన వర్గాల వారికి వీటి ద్వారా మేలు చేకూరనుందని ఆయన చెప్పారు.
తొలి విడతలో 750 మిలియన్ డాలర్లు..
750 మిలియన్ డాలర్లతో చేపట్టిన తొలి విడత ఆపరేషన్ ఈ ఏడాది మేలో ఆమోదం పొందింది. దీని ద్వారా ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(పీఎంజీకేవై) కింద.. సుమారు 3.2కోట్ల ఖాతాలకు నగదు బదిలీ అయింది. అంతేకాకుండా మరో 8కోట్లమందికి లబ్ధి చేకూరింది.
ఇదీ చదవండి: 2022 వరకు 25% మందికి టీకా గగనమే!