దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌కు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు కుటుంబ సభ్యులు, అభిమానులు. దిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్ వద్ద అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తిచేశారు. భారీ వర్షం, ఈదురు గాలులను లెక్కచేయకుండా.. అభిమాన నేతకు అంతిమ వీడ్కోలు పలికేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ప్రముఖుల హాజరు
యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, హోంమంత్రి సత్యేంద్ర జైన్ హాజరై కడసారి వీడ్కోలు పలికారు. భావోద్వేగానికి గురైన సోనియా.. తనకు షీలా దీక్షిత్ ఎంతో మద్దతిచ్చారని, ఆమె తనకు పెద్ద చెల్లెలు వంటిదని కన్నీటి పర్యంతమయ్యారు.
అనారోగ్యంతో శనివారం కన్నుమూశారు షీలా దీక్షిత్. తూర్పు నిజాముద్దీన్‌లోని నివాసంలో ప్రజల సందర్శనార్థం ఆమె భౌతిక కాయాన్ని అందుబాటులో ఉంచారు. ఆదివారం మధ్యాహ్నం దిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. పార్టీ కార్యకర్తల సందర్శన అనంతరం అంతిమ యాత్ర చేపట్టారు.
ఇదీ చూడండి: పాశ్చాత్య సంగీతం, పాదరక్షలంటే షీలాకు ప్రీతి