జమ్ముకశ్మీర్‌లో పరిస్థితి, ఆర్థిక మందగమనం, నిరుద్యోగం, పౌరసత్వ బిల్లుపై విపక్షాల విమర్శలు, అభ్యంతరాల నేపథ్యంలో సోమవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడీవేడిగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తుండగా... కొన్ని కీలక బిల్లులకు ఆమోదం పొందే లక్ష్యంతో అధికార పక్షం వ్యూహాలు రచిస్తోంది.
కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులు
శీతాకాల సమావేశాల్లో పౌరసత్వ చట్ట సవరణ బిల్లును ఆమోదింపజేయాలని ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు యోచిస్తోంది. రెండు ఆర్డినెన్సులను చట్టాలుగా మార్చాలనుకుంటోంది.
పొరుగుదేశాల నుంచి వచ్చిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కల్పించేలా పౌరసత్వ చట్ట సవరణ బిల్లును రూపొందించింది కేంద్రం. గత సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపట్టినా విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకతతో ఆమోదం పొందలేదు.
ఆర్డినెన్సులు
మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు స్వదేశీ సంస్థలకు కార్పొరేట్ పన్ను తగ్గిస్తూ సెప్టెంబరులో నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఈ ఆర్డినెన్సును పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చట్టంగా మార్చే అవకాశముంది.
భారత్‌లో ఈ-సిగరెట్ల తయారీ, వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తూ సెప్టెంబరులోనే మరో ఆర్డినెన్సు తీసుకువచ్చింది మోదీ సర్కారు. దీనిని ఈ పార్లమెంటు సమావేశాల్లో చట్టంగా మార్చనుంది.
తొలి సమావేశం చారిత్రకం...
మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక జరిగిన తొలి పార్లమెంటు సమావేశాల్లో కీలక బిల్లులు ఆమోదం పొందాయి. ముమ్మారు తలాక్ బిల్లు, జాతీయ భద్రత సంస్థకు మరిన్ని అధికారాలిచ్చే బిల్లులను ఉభయ సభలు ఆమోదించాయి.
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు , ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించే బిల్లు కూడా తొలి సమావేశాల్లోనే ఉభయ సభల ఆమోదం పొందింది.
ఇదీ చూడండి: ప్రధానితో 'బంధం' గురించి జెన్నిఫర్ చెప్పిన కథ ఇది!