ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) తూర్పు దిల్లీ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థి అతిశిని.. అవమానించేలా అభ్యంతరకరమైన కరపత్రాలను తాను పంచినట్టు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ క్రికెటర్, భాజపా నేత గౌతమ్ గంభీర్ అన్నారు. అవన్నీ నిరాధార ఆరోపణలేనని కొట్టి పారేశారు. ఆప్ నేతలపై తాను పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు గంభీర్. తూర్పు దిల్లీ లోక్‌సభ నియోజకవర్గానికి ఆప్ తరఫున అతిశి, భాజపా తరఫున గౌతం గంభీర్ పోటీ చేస్తున్నారు.
" ఇప్పుడు నిరూపిస్తే ఈ క్షణమే రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఇప్పుడు అభ్యర్థిత్వం వెనక్కి తీసుకోలేరు కదా అని కొందరు అడగొచ్చు. 23వ తేదీ తర్వాత ఒకవేళ నేను గెలిచినా.. వెంటనే రాజీనామా చేస్తా. ఒకవేళ వాళ్లు నిరూపించలేకపోతే నా సవాల్ స్వీకరించేందుకు అరవింద్ కేజ్రీవాల్‌కు ధైర్యముందా? 23వ తేదీ లోగా నిరూపించలేకపోతే ఆయన రాజకీయాలు వదిలేస్తారా? ఈ ప్రశ్నకు ఆయన నుంచి సమాధానం తీసుకోవాలి. 15 రోజుల క్రితం రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని ఎదుర్కునేందుకు కేజ్రీవాల్ ఈ స్థాయికి దిగజారారు. ఆయనను ముఖ్యమంత్రి అనేందుకు సిగ్గు పడుతున్నా. కేజ్రివాల్ లాంటి సీఎం ఉన్న రాష్ట్రంలో ఉండకూడదని కోరుకుంటున్నా."
- గౌతమ్ గంభీర్, భాజపా నేత
తనపై అభ్యంతరకర వ్యాఖ్యలతో కూడిన కరపత్రాలను గంభీర్ ప్రజలకు పంచి పెట్టారని ఆమ్ఆద్మీ తూర్పు దిల్లీ అభ్యర్థి అతిశి గురువారం ఆరోపించారు. మీడియా ఎదుటే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ విషయంపై అరవింద్ కేజ్రివాల్ ట్వీట్ చేశారు. గంభీర్ ఇంత దిగజారుడు రాజకీయాలకు పాల్పడతారని ఊహించలేదని అన్నారు. సోషల్ మీడియాలో ఆప్ నేతలు గంభీర్‌పైన విమర్శలు చేశారు. వీటిపై స్పందించారు గంభీర్.
తనకు మహిళలంటే ఎంతో గౌరవమని, వారిని అవమానించేలా ఏ పని చేయలేదని స్పష్టం చేశారు. ఆప్ నేతల ఆరోపణలను తిప్పికొట్టారు. నిరూపించాలంటూ సవాల్ విసిరారు.
ఇదీ చూడండి : గంభీర్ ప్రత్యర్థి కన్నీరు... భాజపాపై తీవ్ర విమర్శలు