రోజు రోజుకీ వైద్యులపై దాడులు పెరిగిపోతున్నాయి. ఈ దాడులను నివారించటానికి కేంద్రం చర్యలు ప్రారంభించింది. విధులు నిర్వహిస్తున్న వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడిన వారికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేలా బిల్లును తీసుకురానుంది. ఈ బిల్లును రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశంలో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
ఈ బిల్లుపై అన్ని శాఖల మంత్రుల అభిప్రాయాన్ని కోరింది ఆరోగ్య శాఖ. వచ్చే వారం జరిగే కేబినెట్ సమావేశంలో తమ అభిప్రాయాలను తెలపనున్నారు మంత్రులు.
జరిమానా వివరాలు...
విధుల్లో ఉన్న వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిని తీవ్రంగా గాయపరిచిన వారిపై 3 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ. 2 -10 లక్షల జరిమానా విధించాలని ముసాయిదాలో ప్రతిపాదించింది.
ఆసుపత్రిలో ఆస్తి నష్టం కలిగించిన వారికి 6 నెలల నుంచి 5 ఏళ్ల శిక్ష , రూ. 50 వేల నుంచి రూ.5 లక్షలు జరిమానా విధించాలని సూచించింది. రూ. లక్ష నుంచి రూ.5 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం చేస్తే వారికి ప్రస్తుత మార్కెట్ ధర కన్నా రెండింతలు జరిమానా విధించాలని ముసాయిదా పేర్కొంది.
ఒకవేళ నిందితుడు నగదు చెల్లించలేని పరిస్థితిలో ఉంటే '1890 -రెవెన్యూ రికవరీ చట్టం' ప్రకారం భూమిని బకాయిగా పొందవచ్చని తెలిపింది.
విధులు నిర్వహించే వైద్యులు, ఇతర ఆరోగ్య సేవా కేంద్రాలు, క్లినికల్ సంస్థల ఆస్తులను ధ్వంసం చేయటాన్ని నేరంగా పరిగణించే ఈ బిల్లును రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి తెలిపారు.
ఎవరికి వర్తిస్తుంది....
ఈ చట్టం కింద వైద్యులు, పారా-మెడికల్ సిబ్బంది, మెడికల్ విద్యార్థులు, రోగనిర్ధారణ సేవా సంస్థలు, అంబులెన్స్ చోదకులు వస్తారని పేర్కొంది.
ఏ అంశాలు పరిగణనలోకి...
విధి నిర్వహణలో ఉన్న వైద్యులు, సేవా సిబ్బందిపై వ్యక్తగత దూషణలు చేసినా, హింసించినా, ఆస్తులను ధ్వంసం చేసినా, అపాయాన్ని కలిగించినా, ఏదైనా ముఖ్య పత్రాలను నాశనం చేసినా ఈ చట్టం కింద శిక్ష పడుతుందని వెల్లడించింది.
జూన్ నెలలో...
గత జూన్ నెలలో బంగాల్ రాష్ట్రంలో చికిత్స సమయంలో రోగి మరణించినందున అతని బంధువులు, సహచరులు వైద్యులపై దాడి చేశారు. ఈ దాడికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో కేంద్ర ఈ బిల్లును తీసుకురానుంది.
ఇదీ చూడండి:సీజేఐ రంజన్ గొగొయికి ఘనంగా వీడ్కోలు