కేరళలో పేలుడు పదార్థాలతో కూడిన పైనాపిల్ను తిని మరణించిన ఏనుగు పోస్టుమార్టంలో హృదయం ద్రవించే నిజాలు వెలుగుచూశాయి. దవడ మొత్తం పూర్తిగా దెబ్బతిని భరించలేని నొప్పి, ఆకలి, దాహార్తితోనే ఏనుగు ప్రాణాలొదినట్లు వైద్యులు తెలిపారు. ఆహారం మాట పక్కనపెడితే.. ప్రమాదం జరిగినప్పటి నుంచి మరణించే వరకూ దాదాపు రెండు వారాలు తీవ్రమైన నొప్పి కారణంగా ఏనుగు కనీసం మంచినీళ్లు కూడా తీసుకోలేక నరకయాతన అనుభవించిందని వెల్లడించారు.
తన బాధను ఎవరికి చెప్పాలో.. ఏం చేయాలో తెలీక ఏనుగు అలాగే నదిలో నిల్చుని నీరసంతో కుప్పకూలిపోయినట్లు పోస్టుమార్టం నివేదిక తెలిపింది. ఏనుగు మృతదేహంలో ఎలాంటి బుల్లెట్ గాయాలు, లోహ వస్తువులు, విదేశీ ఆయుధ పరికరాలు లేవని స్పష్టం చేసింది.
అయితే నదిలో మునిగిపోయిన అనంతరం ఎక్కువ నీళ్లు తాగడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినడం వల్లే ఏనుగు మృతికి కారణమని మే 28న చేసిన ప్రాథమిక నివేదకలో స్పష్టం చేశారు వైద్యులు.
అమానవీయ ఘటనను యావత్ దేశం ముక్తకంఠంతో ఖండించింది. నిందితులకు కఠినశిక్ష విధించాలని కోరింది.
ఏనుగు మృతికి కారణమైన వారిలో ఇప్పటికే ఒకరిని అరెస్టు చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.