గాల్వన్ లోయ.. భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నడుమ ప్రస్తుతం ఈ ప్రాంతం చర్చనీయాంశంగా మారింది. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద ఉన్న ఈ వ్యాలీలోనే సోమవారం రాత్రి ఘర్షణ చెలరేగి ముగ్గురు భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితులు ఇలానే కొనసాగితే.. రెండు అణ్వాయుధ దేశాల మధ్య ఘర్షణ ఎటు దారితీస్తుందో అన్న ఆందోళన నెలకొంది. ఈ ఘర్ణణకు నెలవైన ఈ ప్రాంతానికి గాల్వన్ అన్న పేరు ఎలా వచ్చిందో కనుక్కుంది ఈటీవీ-భారత్. ఇందుకోసం పలువురు చరిత్రకారులు, స్థానిక పూర్వీకులను సంప్రదించింది.
'గాల్వన్' ఓ కశ్మీరీ ఇంటిపేరు
ఎల్ఏసీ సమీపంలోని ఈ వ్యాలీ వద్ద గాల్వన్ అనే నది ప్రవహిస్తుంది. హిమాలయాల్లోని కారాకోరంలో పుట్టి అక్సాయిచిన్ గుండా ఉత్తరదిశగా 80 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది గాల్వన్. అనంతరం తూర్పు లద్దాక్‌లోని షయోక్ నదిలో కలుస్తుంది. 1962లో భారత్-చైనా యుద్ధ సమయంలోనూ ఈ గాల్వన్ లోయ గురించి చర్చ జరిగింది. ఓ కశ్మీరీ ఇంటిపేరు అయిన గాల్వన్.. ఆ తర్వాత ఈ ప్రాంతం పేరుగా రూపాంతరం చెందినట్లు 'ఈటీవీ భారత్' రిపోర్టులో తేలింది.
'గులాం రసూల్ షా' అనే కశ్మీరీ ఇంటిపేరున గాల్వన్ రూపాంతరం చెందినట్లు అతని మనవడు అయిన మహమ్మద్ అమిన్ గాల్వన్.. ఈటీవీ-భారత్‌కు వెల్లడించారు. గులాం రసూల్ షానే.. గాల్వన్ అని కూడా పిలిచేవారని అమిన్ స్పష్టం చేశారు. డోగ్రా పాలకుల భయంతో గాల్వన్ ముత్తాత కర్రా గాల్వన్ కశ్మీర్‌ను విడిచిపెట్టి బాల్టిస్థాన్‌లో స్థిరపడినట్లు చెప్పాడు అమిన్.
" గులాం రసూల్ 1878లో లేహ్‌లో జన్మించారు. 12 ఏళ్ల వయసులో బ్రిటిష్ ప్రయాణికులు, అన్వేషకులకు లద్దాఖ్, హిమాలయాల గుండా మధ్య ఆసియాకు వెళ్లేందుకు మార్గనిర్దేశం చేసేవాడు. రసూల్ కుటుంబమంతా లేహ్‌లోనే స్థిరపడింది. అయితే డోగ్రా పాలకుల భయంతో కర్రా గాల్వన్ కశ్మీర్‌ను విడిచి బాల్టిస్థాన్‌లో స్థిరపడ్డారు."
- మహమ్మద్ అమిన్, గాల్వన్ వంశీయుడు
గతకొద్ది రోజులుగా భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు అమిన్.
"కొన్నివారాలుగా వాస్తవాధీన రేఖ వైపుగా భారత బలగాల మోహరింపు కూడా ఎక్కువైంది. ఏది ఏమైనా లద్దాఖ్ ప్రజలందరూ భారత సైన్యానికే మద్దతుగా ఉంటారు. ఎలాంటి సాయం కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు."
- మహమ్మద్ అమిన్, గాల్వన్ వంశీయుడు
గాల్వన్ ప్రాంత చరిత్రను తెలుసుకునేందుకు రెండు వారాల క్రితం చరిత్రకారుడైన గని షేక్నూ సంప్రదించింది ఈటీవీ భారత్. ఆయన కూడా అమిన్ చెప్పిన కథనే చెప్పారు.