ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో పాకిస్థాన్ పాత్రపై వాస్తవాలేంటో ప్రపంచం మొత్తానికి తెలుసని భారత విదేశీ వ్యవహారాలశాఖ పేర్కొంది. పదేపదే నిరాకరించినంత మాత్రాన నిజాలు దాగవని అభిప్రాయపడింది. అమెరికా, భారత్ మధ్య జరిగిన టూ ప్లస్ టూ సమావేశంలో పాకిస్థాన్ సహా సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రస్తావించడంపై పాక్ అభ్యంతరం తెలిపిన నేపథ్యంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ మేరకు స్పందించింది.
పాకిస్థాన్ ఏమిటో, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో పాక్ పాత్రేంటో ప్రపంచం మొత్తానికి తెలుసని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ అన్నారు. ఐక్యరాజ్యసమితి నిషేధిత జాబితాలో ఉన్న ఉగ్రవాదుల్లో ఎక్కువ మందికి ఆశ్రయం పాక్ కల్పిస్తుందని గుర్తుచేశారు. అలాంటి పాక్ తాను కూడా బాధిత దేశమేనని చెప్పుకునేందుకు ప్రయత్నించకూడదని హితవు పలికారు.
- ఇదీ చూడండి: 'పుల్వామా దాడి ఇమ్రాన్ ప్రభుత్వ విజయం'