బారెడు పొద్దెక్కినా చాలామంది నిద్రలేవడానికి బద్ధకిస్తారు. కానీ, కేరళకు చెందిన 15 ఏళ్ల అలిఫా అనాస్ మాత్రం.. సూర్యుడితో పోటీ పడి నిద్ర లేస్తుంది. ఆపై లేడిబర్డ్ సైకిలెక్కి నాన్నకు సాయం చేస్తోంది. కనీసం వంద ఇళ్లకు న్యూస్ పేపర్ చేరవేస్తోంది.
ఎర్నాకులం, నెల్లికుజికి చెందిన అలిఫా తండ్రి అనాస్ ఓ న్యూస్ పేపర్ డిస్టిబ్యూటర్. తెల్లారకముందే నాన్న కుటుంబం కోసం పడే కష్టాన్ని చూసి.. ఆయనకు సాయంగా ఉండాలనుకుంది అలిఫా. సైకిల్ నేర్చుకున్నదే ఆలస్యం నాన్నతో పాటు తానూ పేపర్ వేసేందుకు సిద్ధమైంది. రోజూ ఉదయం కొత్త మంగళం నుంచి తండ్రి న్యూస్ పేపర్లు తీసుకురాగానే.. ఆ వార్తా పత్రిక కట్ట సైకిల్ బుట్టలో వేసుకుని ప్రయాణం మొదలుపెడుతుంది.
ఈ ఏడాదే స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసిన అలీఫా చలికి వణుకదు.. వర్షానికి వెనకడుగు వేయదు. నెల్లికుజిలోని చిరపది నుంచి ట్రమల్లూర అంబాడినగర్ వరకు దాదాపు గంటన్నర పాటు, 2కిలోమీటర్లు సైకిల్ తొక్కుతుంది. ఏది ఏమైనా రోజూ కనీసం వంద ఇళ్లకు పైగా వార్తా పత్రికలను చేరవేస్తుంది. పిన్న వయసులోనే బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది అలిఫా.
ఇదీ చదవండి: 42 ఏళ్ల అజ్ఞాతవాసం వీడి.. భారత్కు చేరిన రాములోరు!