ఉన్నత విద్యాభ్యాసం చేసినా ఉపాధి పొందని అభ్యర్థులు మనదేశంలో లక్షల సంఖ్యలో ఉన్నారు. భారతీయతను, స్థానిక పరిస్థితులను మరచి, పాశ్చాత్య ప్రభావంలో పడిపోయిన విద్యా విధానంపై మహాత్ముడు ఆ రోజుల్లోనే హెచ్చరించారు. ఆవేదన చెందారు. ఆయన దూరదృష్టి ఎలా ఉందో.. నేడు ఉపాధికై ఎదురుచూస్తున్న లక్షల మంది విద్యార్థుల పరిస్థితే చెబుతోంది.
భారతీయ విద్యా వ్యవస్థ ఎలా ఉండాలని గాంధీజీ కలలు కన్నారు..? ఆయన హెచ్చరికలకు తొలితరం నేతలు ఎందుకు ప్రాధాన్యం ఇవ్వలేదు..? గాంధీజీ ప్రతిపాదించిన విద్యా విధానం ఏంటీ..? గ్లోబలైజేషన్ యుగంలో మహాత్ముడి విధానాల్లో మన్నిక ఉందా..? గాంధీ సూచించిన విద్యావ్యవస్థకు మనం ఎంతవరకు న్యాయం చేశాం..?
ఆంగ్లం ముద్ర...
స్వాతంత్ర్యం తర్వాత దేశంలో విద్యావ్యవస్థ, మానవాభివృద్ధి సహా.. అన్ని విషయాల్లో ఆంగ్లేయుల ప్రభావం కనిపించింది. ఈ నేపథ్యంలో విద్యావ్యవస్థపై మహాత్మాగాంధీ ఆలోచనలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పాశ్చాత్య సంస్కృతికి వ్యతిరేకి...
గాంధీజీ తొలి నుంచి పాశ్చాత్య సంస్కృతికి, ఆంగ్ల భాషకు వ్యతిరేకం. మనదేశంలో ఏ వ్యవస్థ అయిన భారతీయతతో, స్థానిక పరిస్థితులకు అనుకూలంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. మాతృభాషకు ప్రథమ ప్రాధాన్యం దక్కాలని సూచించారు. ఈ కోణంలో పాశ్చాత్యులు, ముఖ్యంగా ఇంగ్లీష్ విద్యపై తమ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేశారు.
వీటిని దృష్టిలో పెట్టుకుని, వాటి స్థానంలో ప్రత్యమ్నాయాల కోసం.. మహారాష్ట్రలోని వార్ధాలో ఏర్పాటు చేసిన సేవాగ్రామ్‌లో మహాత్ముడు ప్రయోగాలు చేశారు. బారిష్టరు చదువు కోసం ఇంగ్లాండ్, ఆ తర్వాత దక్షిణాఫ్రికాలో గడిపిన తన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భారత విద్యావ్యవస్థ అనుసరించాల్సిన వైఖరిపై గాంధీజీ సలహాలు ఇచ్చారు. పాఠశాల వాతావరణంలో ఏ మనిషి పరిపూర్ణ వ్యక్తిగా మారడని ఆయన అభిప్రాయ పడ్డారు. ఓ వ్యక్తిగా ఎదికేందుకు.. పాఠశాలలో తోడ్పాటు అందుతుందని భావించారు.
స్వతంత్రం తర్వాత..
స్వతంత్రం తర్వాత అనుసరించాల్సిన విద్యా విధానంపై గాంధీజీ తన అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేశారు. పాశ్చాత్యులు సైతం మన విద్యావిధానాన్ని మెచ్చుకున్నారు. కానీ.. ఎంతమంది భారతీయులు విద్యను వ్యక్తిత్వ వికాస సాధనంగా భావించారు అనే ప్రశ్నకు మాత్రం సానుకూల సమాధానం రాలేదు.
స్వాతంత్ర్య ఉద్యమంలో పదే పదే ఆంగ్లంలో మాట్లాడాల్సి రావడంపైనా.. గాంధీజీ ఆవేదన చెందారు. న్యాయవాదిగానూ మాతృభాషలో సాధన చేసే అవకాశం లేకపోయిందని వాపోయారు. అన్ని అధికారిక ఉత్తర్వులు ఆంగ్లంలో ఉండటం, దినపత్రికలు అవే కావడం ఆయనను అసంతృప్తికి గురిచేసింది.
పరస్పర విరుద్ధం...
నిజానికి పారిశ్రామికీకరణపై గాంధీజీ, నెహ్రూ భావనలు పరస్పర విరుద్ధం. పారిశ్రామికీకరణ, దాని అనుబంధ నైపుణ్య విద్య నేర్చుకోవాలంటే తిరిగి ఆంగ్లంపై ఆధారపడక తప్పదని గాంధీజీ భావించారు. స్వంతంత్రం తర్వాత ప్రజల్లో పెరిగిపోయిన ఆకాంక్షలను అందుకునేందుకు, ఉపాధికి పారిశ్రామీకీకరణ తప్ప మరో మార్గం లేదని నెహ్రూ భావించారు. అలా విద్యావ్యవస్థ ద్వారా మహాత్ముడు ఆశించిన దీర్ఘకాల ప్రయోజనాలు నెరవేరలేదు.
యాంత్రీకరణకు వ్యతిరేకి...
యాంత్రీకరణకు వ్యతిరేకంగా ఉండే గాంధీ ఆలోచనలు.. విద్యపై తీవ్రంగా ఉండేవి.
పాఠశాలలో చేతివృత్తులు నేర్పించాలని ఆయన ప్రతిపాదించారు. విద్యా బోధన చేతి వృత్తుల సాధన కేంద్రంగా జరగాలని ఆయన కోరుకున్నారు. మనదేశంలో వందల ఏళ్లుగా సామాజిక నిర్మాణంలో చేతివృత్తి కళాకారులు కొందరే ఉన్నారు. స్పిన్నింగ్, చేనేత, తోలు పని, కుండలు, లోహపు పని, పుస్తకాలు, బిస్కట్ తయారీ కొన్ని కులాలకే పరిమితమైపోయింది. సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని గాంధీజీ ఆలోచన. కానీ.. గాంధీజీ ఆశించిన దానికి వ్యతిరేకంగా భారత విద్యా వ్యవస్థ ఆంగ్ల భాష, దాని సంస్కృతికి లోబడి సాగింది.
నయ్ తాలిమ్ కొత్తవిద్య...
నేటి విద్యావ్యవస్థలో నేర్చుకున్న విజ్ఞానానికి , చేస్తున్న పనికి సంబంధమే లేదు. ప్రపంచ వ్యాప్తంగా భారీగా పెరిగిపోతున్న నిరుద్యోగితకు అదే కారణం. అందుకే.. మన చదువు, చేసే పని రెండు వేర్వేరు కాదని చెప్పేదే 'నయ్ తాలిమ్'విద్యావిధానం. చదువు, పని రెండు కలిస్తేనే అసలైన విద్యని చెబుతుంది. ఆచరిస్తుంది.. నయ్ తాలిమ్.
విద్యావ్యవస్థపై గాంధీజీ ఆలోచనలకు నయ్ తాలిమ్ ప్రతిరూపం. ఉన్నత చదువుల కోసం పాశ్చాత్య దేశాలకు వెళ్లిన మహాత్ముడు.. అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా అర్థం చేసుకున్నారు. దక్షిణాఫ్రికాలో తాను జరిపిన పోరాటంలో విద్యావ్యవస్థ పోషించిన పాత్ర ఆయనపై ప్రభావం చూపింది. విద్యపై ఆయన ఆలోచనను మార్చింది.
న్యాయవాద విద్య కోసం ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా వెళ్లిన గాంధీజీ ఏళ్లపాటు అక్కడే ఉన్నారు. అక్కడి విద్య వ్యవస్థ" ఏళ్ల తరబడి ఒకేరీతిగా ఉందని, ఆ విద్య మనుషులను బానిసలుగా మార్చుతుంది" అని ఆయన భావించారు. అదే ఆంగ్ల విద్యను స్వీకరించి.. తాము బానిసలమై పోయామని ఆవేదన చెందారు.
వార్ధా విద్యా పథకం...
నాయి తలీమ్‌గా ప్రసిద్ది చెందిన 'వార్ధా విద్యా పథకం' భారతదేశంలో ప్రాథమిక విద్యారంగంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది. ఈ పథకం 1930 లలో స్వదేశీ విద్యా పథకాన్ని అభివృద్ధి చేయడానికి చేసిన మొదటి ప్రయత్నం. 1937 జూన్ 31 వరకు హరిజన్ పత్రికకు రాసిన వరస వ్యాసాల్లో విద్యావ్యవస్థపై తన ఆలోచనను గాంధీజీ వ్యక్తం చేశారు. ఈ ఆలోచనలు వివాదాస్పదమయ్యాయి.
చివరకు తన ఆలోచనలను నిపుణుల చేత పరీక్షించేందుకు 1937 అక్టోబర్ 22, 23న మహారాష్ట్ర లోని వార్ధాలో గాంధీజీ సమావేశం ఏర్పాటు చేశారు. గాంధీజీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి.. వివిధ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సమావేశంలో నాలుగు తీర్మానాలు ఆమోదించారు. అవి
- నిర్బంధ, ఉచిత విద్య అందించాలి.
- మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి.
- స్థానిక పరిస్థితులను అనుగుణంగా, ఆ ప్రాంతాల్లో చేతివృత్తులపై అందరికీ నైపుణ్యం లభించేలా విద్యాబోధన జరగాలి.
- విద్యా వ్యవస్థ క్రమంగా ఉపాధ్యాయుల వేతనాలను పెంచాలి.
ఆ తర్వాత డాక్టర్ జాకీర్ హుస్సేన్ నేతృత్వంలో ఓ కమిటీని ఈ సమావేశం ఏర్పాటు చేసింది. సమగ్ర విద్యా విధానం అమలుకు ప్రణాళిక, పాఠ్యాంశాల వివరాలను తెలపాలని కమిటీకి సూచించింది.
గాంధీజీ నేతృత్వంలో కమిటీ చేసిన నాలుగు తీర్మానాలకు ప్రస్తుత విద్యావిధానం సాగుతున్న తీరుకు సంబంధమే లేదు. ప్రస్తుతం సమాజం ఎదుర్కోంటున్న సవాళ్లను దృష్టిలో పెట్టుకుని ఆంగ్ల విధానాన్ని పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. యాంత్రీకరణకు వ్యతిరేకంగా గాంధీజీ ఎందుకు అంత బలంగా వాదించారో.. రోజు రోజుకూ పెరిగిపోతున్న నిరుద్యోగిత రేటే చెబుతోంది. పెద్ద పెద్ద చదువులు చదివినప్పటికీ... కంఫ్యూటర్లు, యంత్రాలు యువతకు ఉపాధి కల్పించలేకపోతున్నాయి. మన విద్యావిధానం, విద్య.. ప్రపంచీకరణ చెందింది. పెరిగిపోతున్న నిరుద్యోగిత మారుతున్న అవసరాలను తీర్చగలదా అన్నదే ఇప్పుడు సందేహం.
(రచయిత - చంద్రకాంత్ నాయుడు)