ఎవరూ ఊహించలేదు.. రాజకీయ పండితులు ఇలాంటి ముగింపు ఉంటుందని అంచనా వేయలేకపోయారు.. శివసేన శ్రేణులు సంతోషంగా ఉన్నాయి.. ఇక ఉద్దవ్ ఠాక్రే మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడమే తరువాయి.. శుక్రవారం రాత్రి పూర్తయితే చాలు.. పదవీ పగ్గాలు సేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమికి అందుతాయని అందరూ అనుకున్నారు. కొద్ది గంటల్లోనే రాజకీయం పూర్తిగా మారిపోయింది. తల పండిన రాజకీయవేత్తలు సైతం ఇలా జరుగుతుందని అనుకోలేదు.. ఎన్సీపీ అగ్రనేత శరద్ పవార్ సోదరుడి కుమారుడు అజిత్ పవార్ సారథ్యంలోనే ఎన్సీపీకి చెందిన అనేకమంది ఎమ్మెల్యేలు భాజపాకు మద్దతు పలికారు. దీంతో గవర్నర్ కోష్యారీ దేవేంద్ర ఫడణవీస్‌ను సీఎంగా నియమించారు. ఫడణవీస్ సీఎంగా, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో మహా నాటకం కీలక ఘట్టంలోకి అడుగుపెట్టింది.
అమిత్‌షా, మోదీల వ్యూహం
భాజపా అధ్యక్షుడు అమిత్‌షా, ప్రధాని నరేంద్రమోదీలు అసెంబ్లీ ఫలితాల అనంతరం శివసేన అడ్డం తిరగడంతో బుజ్జగింపులకు చెక్ పెట్టారు. వాస్తవానికి ఎన్సీపీ, కాంగ్రెస్‌లోని మెజర్టీ నేతలకు సేనతో చేతులు కలపడం ఇష్టం లేదు. అదే విధంగా శివసేన శ్రేణులకు కూడా ఈ కలయిక నచ్చలేదు. దాదాపు ఐదు దశాబ్దాలకుపైగా సేన, కాంగ్రెస్‌లు వైరి పక్షాలుగా వ్యవహరించాయి. సీఎం పీఠంపై శివసేన వేసిన పిల్లిమొగ్గలు కమలనాథుల్లో చురుకుపుట్టించాయి. దీంతో తమకు మెజార్టీ లేదని దూరంగా ఉండిపోయినా ఎన్సీపీతో తెరవెనుక చర్చలకు తెరలేపారు. అజిత్ పవార్‌కు శివసేనతో కలవడం అసంతృప్తిగా ఉంది. దీన్ని గమనించిన భాజపా వారితో చర్చలు జరపడం ఫలితానిచ్చింది.
పవార్‌కు అదే పాఠం
మహారాష్ట్ర అంకంలో తీవ్రంగా నష్టపోయింది శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అని చెప్పవచ్చు. ఆయన పార్టీ నిలువునా చీలిపోయింది. ఆయన సోదరుని కుమారుడైన అజిత్ పవార్ పార్టీని చీల్చి భాజపాకు మద్దతు పలికారు. మరాఠా రాజకీయాల్లో తలపండిన రాజకీయవేత్త పవార్. 1978లో ఆయన కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. అప్పటి సీఎం వసంత్‌దాదా పాటిల్ వద్దనే ఉండి మర్నాడే పార్టీని చీల్చి ప్రొగ్రెసివ్ ఫ్రంట్ నెలకొల్పి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. సరిగ్గా ఇప్పుడు ఆయనకే ఆ పాఠం ఎదురవడం విశేషం. అజిత్ పవార్ వెంట 30 మంది ఎన్సీపీ శాసనసభ్యులు ఉన్నట్టు సమాచారం. దీంతో మరాఠా వృద్ధనేత శరద్ పవార్‌కు ఇది మింగుడు పడని అంశమే.
తీవ్రంగా నష్టపోయిన సేన
మహరాష్ట్రలో శివసేనకు ఈ ఘట్టం తీవ్ర నష్టాన్ని కలిగించింది. పార్టీకి ఉన్న విశ్వసనీయతను దెబ్బతీసింది. కాంగ్రెస్, ఎన్సీపీతో పొత్తుకు సిద్ధం కావడంపై హిందూత్వవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు, రానున్న రోజుల్లో వీరు పార్టీకి దూరమయ్యే ప్రమాదముంది. భవిష్యత్తులో పార్టీ ప్రభావం తగ్గే అవకాశముంది.
మెజార్టీ ఎలా?
భాజపాకు 105 సభ్యులున్నారు. ఎన్సీపీ చీలికవర్గం నుంచి 30 మంది ఎమ్మెల్యేల బలముంది. 10 మంది వరకు స్వతంత్రులు మద్దతునిస్తున్నారు. శివసేన నుంచి కూడా చీలిక ఉండొచ్చు. మొత్తం 288 సభ్యులున్న సభలో భాజపా కూటమికి సగం మంది కంటే ఎక్కువగా మద్దతునిస్తున్నారు. దీంతో ఫడణవీస్ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు.
ఇదీ చూడండి : లైవ్: ఉత్కంఠగా 'మహా' రాజకీయం- 'పరీక్ష'పై పార్టీల వ్యూహాలు