పౌరసత్వ చట్టం వ్యతిరేక ఆందోళనలతో అట్టుడికిన పలు రాష్ట్రాల్లో అల్లర్లు సద్దుమణిగాయి. దిల్లీ మినహా మిగతా రాష్ట్రాల్లో శుక్రవారం ప్రశాంత వాతావరణం కనిపించింది. గురువారం నిరసనలతో ఉద్రిక్తంగా మారిన కర్ణాటకలోని మంగళూరు సహా ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో క్రమంగా ప్రశాంత పరిస్థితి నెలకొంటోంది.
మంగళూరులో కర్ఫ్యూ కొనసాగింపు..
పౌర చట్టానికి వ్యతిరేకంగా కర్ణాటకలోని మంగళూరులో జరిగిన ఘర్షణల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో విధించిన కర్ఫ్యూను శుక్రవారం కొనసాగించారు. నగరంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అంతర్జాల సేవలు నిలిపేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై ఆంక్షలు విధించారు. కేరళకు చెందిన 50 మంది నగరంలోకి వచ్చేందుకు ప్రయత్నించగా వారిని అదుపులోకి తీసుకున్నారు.
రాష్ట్ర ప్రజలు.. కొందరి స్వార్థ ప్రయోజనాలకు గురికాకుండా దూరంగా ఉండాలని పేర్కొన్నారు ముఖ్యమంత్రి యడియూరప్ప. పౌరులందరి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా కల్పించారు.
యూపీలో ఆంక్షలు..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు పోలీసులు. లఖ్‌నవూ, సంభాల్, మవూ, అలీగఢ్, ఘజియాబాద్, రాయ్‌బరేలీలో అంతర్జాల, ఎస్ఎంఎస్ సేవలను నిలిపివేశారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. శుక్రవారం ప్రార్థనలు ఉన్న నేపథ్యంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు పోలీసులు.
దిల్లీలో అక్కడక్కడా..
రాజధాని దిల్లీలోని జామియా ఇస్లామియా విశ్వవిద్యాలయం ముందు కొందరు విద్యార్థులు, స్థానికులు ఆందోళన చేపట్టారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసం ముందు దిల్లీ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలను చేప్టటారు. పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్ర కోట ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. నిరసనలు జరగకుండా శీలంపుర్ ప్రాంతంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు పోలీసులు.
కేరళలో హైఅలర్ట్..
కర్ణాటక మంగళూరులో ఇద్దరు ఆందోళనకారులు మరణించిన క్రమంలో కేరళ సరిహద్దు జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించారు అధికారులు. వయనాడ్, కోజికోడ్, కసరగాడ్‌లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడక్కడ చిన్నపాటి నిరనసలు కొనసాగుతున్నాయి.
అసోం, బంగాల్లో ప్రశాంత వాతావరణం..
కొద్ది రోజులుగా ఆందోళనలతో అట్టుడిగిన అసోంలో ప్రస్తుతం అల్లర్లు సద్దుమణిగి ప్రశాంత వాతావరణం నెలకొంది. అంతర్జాల సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. పౌర చట్టం అనేది బంగ్లాదేశ్ నుంచి కొత్తగా దేశంలోకి చొరబాట్లను ప్రోత్సహించదని స్పష్టం చేశారు అసోం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్. పశ్చిమ్ బంగాలోనూ శుక్రవారం ప్రశాంత వాతావరణం కనిపించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు.
తమిళనాడులో 600 మందిపై కేసు..
పౌర చట్టానికి వ్యతిరేకంగా చెన్నై వల్లువర్ కొట్టంలో గురువారం ఆందోళనలు చేపట్టిన 600 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కేసుల్లో నటుడు సిద్ధార్థ్, ఇంద్రజాలికుడు టీఎం కృష్ణ, ఎంపీ తిరుమవలవన్ సహా పలువురు ప్రముఖులు ఉన్నారు.
ఇదీ చూడండి: ఆందోళనకారులకు అరటిపండ్లు, అల్పాహారంతో ఆతిథ్యం..!