బంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి, మాజీ క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా తన పదవికి రాజీనామా చేశారు. రాజకీయపరంగా శుక్లా భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత రావాల్సి ఉంది.
శుక్లా.. ఇప్పటికే తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ జగదీప్ ధన్కర్లకు పంపించారు. రాష్ట్రంలో కీలక నేత సువేందు అధికారి సహా పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడిన పక్షం రోజులకే.. శుక్లా కూడా మంత్రి పదవికి రాజీనామా చేశారు.
దీదీ ఏమన్నారంటే..
శుక్లా రాజీనామాపై స్పందించిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఎవ్వరైనా రాజీనామా చేయొచ్చని తెలిపారు. అయితే.. క్రీడలకు ఎక్కువ సమయం కేటాయించేందుకే ఆయన రాజీనామా చేశారని, దీనిని వేరేలా అర్థం చేసుకోవద్దని ఆమె స్పష్టం చేశారు. శుక్లా.. ఎమ్మెల్యేగా కొనసాగుతారని దీదీ వెల్లడించారు.
రాజకీయాలకు బైబై..
బంగాల్ రంజీ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ శుక్లా.. హావ్డా (ఉత్తర) నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. ఈయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ.. ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేయలేదు.