గోవా రాజకీయాల్లో రోజు రోజుకు నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. భాజపా నేతృత్వంలోని గోవా ప్రభుత్వానికి త్వరలో మద్దతు ఉపసహరించుకుంటున్నట్లు మహారాష్ట్రవాది గోమంట్ పార్టీ ప్రకటించింది. ఈ నెల 23న జరగనున్న లోక్సభ ఎన్నికలు, మపుసా నియోజకవర్గం ఉపఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతిస్తున్నామని తెలిపింది.
"ప్రమోద్ సావంత్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని మేము నిర్ణయించాం. త్వరలోనే గవర్నర్ మృదులా సిన్హాకు లేఖ రాస్తాము. రెండు లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలనుకుంటున్నాం. " - దీపక్ ధవలికర్, ఎంజీపీ అధ్యక్షుడు.
ఇటీవలే ఇద్దరు ఎంజీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడి భాజపా తీర్థం పుచ్చుకున్నారు. దీని వల్ల 40 మంది సభ్యుల గోవా అసెంబ్లీలో ఒక స్థానానికే ఎంజీపీ బలం పరిమితమైంది.
ప్రస్తుతం అధికార పక్షానికి 14 మంది భాజపా, ముగ్గురు గోవా ఫార్వర్డ్ పార్టీ, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల బలం ఉంది. ప్రభుత్వానికి ఎంజీపీ మద్దతు ఉపసంహరించుకోవటం వల్ల ప్రతిపక్షంలో 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక ఎంజీపీ, ఒక ఎన్సీపీకి ఎమ్మెల్యేలు ఉన్నారు.