కేరళ.. ప్రస్తుతం అనేక దేశాలకు ఆదర్శం. ఇందుకు కారణం... కరోనా మహమ్మారి వ్యాప్తికి విజయవంతంగా అడ్డుకట్ట వేయడమే. భారత్‌లో ఆ రాష్ట్రంలోనే తొలి కేసు నమోదైంది. మరో 'నిఫా' తరహా విపత్తు ఖాయమనుకున్నారు అంతా. కానీ... ఆ తర్వాత కేసులు తగ్గాయి. అందుకే... కరోనా కట్టడికి కేరళ అవలంబించిన విధానాలు తెలుసుకునేందుకు ఇతర రాష్ట్రాల నేతలు క్యూ కడుతున్నారు.
అంకెలే సాక్ష్యం...
3.34కోట్ల జనాభా గల కేరళలో 2020 జనవరి 30న తొలి కరోనా కేసు నమోదైంది. సరిగ్గా నెల రోజుల వ్యవధిలో అమెరికా ప్రధాన నగరం న్యూయార్క్‌లో తొలి పాజిటివ్ కేసును గుర్తించారు. ప్రస్తుతం అమెరికాలో పాజిటివ్ కేసుల సంఖ్య 4లక్షలు దాటగా, మరణాల సంఖ్య 12,800 దాటింది. కేరళలో మాత్రం పాజిటివ్ కేసుల సంఖ్య 336. మరణాల సంఖ్య కేవలం రెండే. మహమ్మారిని ఆ రాష్ట్రం ఎంత విజయవంతంగా కట్టడి చేసిందో చెప్పేందుకు ఈ గణాంకాలే నిదర్శనం. ఈ నేపథ్యంలో కరోనాను నియంత్రించేందుకు కేరళ ప్రభుత్వం అమలు చేసిన వ్యూహాలేంటి? కేరళ మోడల్ అంటే ఏంటి? ఈ అంశాలను ఓ సారి పరిశీలిద్దాం.
తొలికేసుతోనే అప్రమత్తం
గతేడాది నవంబర్‌లో ఇతర దేశాల్లో కరోనా కేసులు నమోదైనప్పుడే కేరళ అప్రమత్తమైంది. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఈ ఏడాది జనవరి 30న కేరళలో తొలి కరోనా కేసు నమోదైంది. వైరస్ పుట్టినిల్లు అయిన చైనా వుహాన్ నుంచి త్రిస్సూర్ వచ్చిన విద్యార్థినికి పాజిటివ్‌గా తేలింది. వెంటనే అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం ముందుగా సిద్ధం చేసుకున్న వ్యూహాలను అమలు చేసింది. వైరస్ నియంత్రణ చర్యలు, ఆరోగ్య జాగ్రత్తలు వంటి అంశాలను అధికారులకు తెలియజేసింది.
తొలికేసు నమోదైన రోజే త్రిస్సూర్ వైద్య కళాశాలలో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ. చైనా నుంచి మరో 200మంది విద్యార్థులు సొంత రాష్ట్రానికి వస్తున్నారని అన్ని జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. మొదటి రోజే 1036 మందిని హోం క్వారంటైన్లో ఉండాలని ఆదేశించింది ప్రభుత్వం. మరో 15 మందికి ఆస్పత్రిలో పరిశీలనలో ఉంచింది. కొవిడ్ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్, హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది.
కేరళ మోడల్-కీలకాంశాలు...
కలిసిన వారిని గుర్తించడం
తొలి పాజిటివ్ కేసు నమోదైన వెంటనే త్రిస్సూర్ వైద్య కళాశాలలో 24 మందికి ఒకే సారి చికిత్స అందించేలా ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వెంటనే వైరస్ బారిన పడిన వ్యక్తి గత కొద్ది రోజుల్లో ఎవరెవర్ని కలిశారనే విషయాలపై ఆరా తీసింది. ఆ వ్యక్తి ఏఏ దుకాణాలకు, హోటల్స్‌కు వెళ్లింది, కలిసిన స్నేహితుల్ని, ప్రయాణించిన వాహనాల్ని ట్రేస్ చేసింది. వివిధ శాఖల అధికారుల సమన్వయంతో వివరాలు సేకరించింది. ఈ విషయాలు ప్రజలకు తెలిసేలా 'రూట్ మ్యాప్'ను ప్రచురించింది. దీనితో సంబంధమున్న ప్రతిఒక్కరు ఆరోగ్య శాఖ అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. వైరస్ వ్యాప్తిని నియంత్రించి తమ కటుంబాలను, సమాజాన్ని కాపాడాలని కోరింది.
వైద్యులు, వైద్య సిబ్బంది కచ్చితంగా మాస్కులు ధరించాలని సూచించింది. చైనా నుంచి కొద్ది రోజుల ముందుగా తిరిగివచ్చిన ప్రతిఒక్కరు లక్షణాలు ఉన్నా, లేకపోయినా సమీప ప్రభుత్వ ఆస్పత్రులకు చేరుకోవాలని సూచిందింది. ఎవరైనా అలా చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీనికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది.
అలాగే ఆస్పత్రులలో పర్యవేక్షణలో ఉన్నవారి కుటుంబసభ్యులు కూడా స్వీయ నిర్భంధంలో ఉండాలని స్పష్టం చేసింది ప్రభుత్వం. ఎలాంటి వేడుకలు నిర్వహించవద్దని, స్నేహితులు, ఇరగుపొరుగు వారిని కలవొద్దని తేల్చిచెప్పింది.
బ్రేక్ ద చైన్
అలప్పుజలో మరో రెండు పాజిటివ్ కేసులు నమోదైన తర్వాత కొవిడ్‌ను రాష్ట విపత్తుగా ప్రకటించింది కేరళ ప్రభుత్వం. అప్పటివరకు నమోదైన 3 కేసులు చైనా వుహాన్ నుంచి ఒకే విమానంలో వచ్చిన వారే. ప్రభుత్వ యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. అధికారులు రేయింబవళ్లు శ్రమించారు. వైరస్ వ్యాప్తి నియంత్రణకు 'బ్రేక్ ద చైన్' ప్రచారాన్ని నిర్వహించారు. పరిశుభ్రత ఆవశ్యకతను ప్రతి వీధి, వాడకు చేరేలా చేశారు. అందరూ చేతులు పరిశుభ్రంగా ఉంచుకునేందుకు నీరు, సబ్బు, శానిటైజర్లను అందుబాటులో ఉంచారు.
కరోనాపై పోరుకు 300మంది వైద్యులు, ఇతర సిబ్బందిని ఒక్కరోజులోనే నియమించింది ప్రభుత్వం. వారందరికీ శాశ్వత హోదాలో అవకాశం కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. కరోనా లక్షణాలు కనిపించిన వారందరినీ పర్యవేక్షణలో ఉంచింది. పరీక్షల్లో నెగిటివ్ వచ్చినా కొద్ది రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని సూచించింది.
సామాజిక ఐకమత్యం-భౌతిక దూరం
కరోనా ఒకరి నుంచి మరొకరికి ఎలా వ్యాప్తి చెందుతుంది అనే విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడంలో పూర్తిగా సఫలమైంది కేరళ సర్కార్. వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించి, చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించింది.
కరోనా కట్టడికి ప్రజలందరూ భౌతిక దూరం పాటించి ఐక్యంగా ఉండాలని కేరళ ప్రభుత్వం ప్రచారం ప్రారభించినప్పుడు దేశంలోని ఇతర రాష్ట్రాలు ఆ ఆలోచన కూడా చేయలేదు.
తప్పనిసరి..
విదేశాల నుంచి వచ్చిన ప్రతిఒక్కరు 14 రోజుల పాటు కచ్చితంగా స్వీయ నిర్బంధంలో ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా నిషేధం విధించింది. హోం క్వారంటైన్లో ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని స్థానిక వైద్య సిబ్బంది పర్యవేక్షించింది. కొవిడ్‌కు సంబంధించిన అన్ని వివరాలను జిల్లా అధికారులకు తెలియజేసింది.
ఆకలి కేకలు లేకుండా..
ఇతర రాష్ట్రాల నుంచి కేరళకు పనికోసం వలస వచ్చిన కార్మికులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. వారందిరినీ అతిథులుగా అభివర్ణించింది. ఆహారం అందించి ఆశ్రయం కల్పించింది. కేరళలో ఏ ఒక్కరు ఆకలితో అలమంటించబోరని స్వయంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రజల్లో ధైర్యం నింపారు. కొవిడ్‌పై ప్రపంచం పోరాడగలదని ధీమాగా చెప్పారు.
ప్రజలకు ఆహారం కోసం సామాజిక వంటశాలలు ఏర్పాట్లు చేసింది కేరళ ప్రభుత్వం. అన్ని గ్రామపంచాయతీల్లో పేదలకు ఆహారాన్ని అందుబాటులో ఉంచింది.
ప్రాణాలకు విలువ..
కరోనా నుంచి వృద్ధులను కాపాడలేమని ఇటలీ, స్పెయిన్ వంటి దేశాలు చేతులెత్తేస్తున్నాయి. కేరళలో మాత్రం ఆ పరిస్థితి లేదు. పథనంతిట్టలోని 93,88 ఏళ్ల వృద్ధ దంపతులు కరోనాను జయించి విజయవంతంగా ప్రాణాలతో బయటపడ్డారు. విదేశాల నుంచి వచ్చిన ఏడుగురు పర్యటకులకు కూడా వ్యాధి నయం చేసి స్వదేశాలకు పంపారు.
గతంలో నిఫా వైరస్‌ను విజయవంతంగా ఎదుర్కొన్న అనుభవం ఇప్పుడు కరోనాను కట్టడి చేయడంలోనూ కేరళకు ఉపయోగపడుతోంది. అక్కడి అద్భుతమైన వైద్య వ్యవస్థ పనితీరు కూడా మరో కారణం.
ఇదీ చూడండి: బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరి.. లేదంటే అరెస్టే!