సరిహద్దులో శాంతిని నెలకొల్పేందుకు చైనా సత్వరమే చర్యలు చేపట్టాలని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య సైనిక స్థాయిలో జరిగిన చర్చల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది. సమావేశంలో.. సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నట్టు అంగీకరించాయని భారత విదేశాంగశాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గుర్తు చేశారు. ఇప్పుడు చైనా తన మాటను నిలబెట్టుకోవాలని సూచించారు.
గల్వాన్ లోయలో జరిగిన హింసాత్మక ఘటన అనంతరం భారత్-చైనా శాంతి చర్చలు జరుపుతున్నాయి. ఇప్పటివరకు సైనిక, దౌత్య స్థాయిలో పలుమార్లు సమావేశమయ్యాయి. సమస్యాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణతో పాటు సరిహద్దు వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నాయి.
చైనా యాప్స్ నిషేధాన్ని కూడా ప్రస్తావించారు శ్రీవాస్తవ. భారత్‌లో కార్యకలాపాలు సాగించాలంటే.. సంబంధిత మంత్రిత్వశాఖ విధించే నిబంధనలకు కట్టుబడి ఉండాలన్నారు.
'ఆ దాడితో సంబంధం లేదు...'
కరాచీ స్టాక్ ఎక్స్చేంజీపై జరిగిన ఉగ్రదాడికి భారత్ కారణమన్న పాకిస్థాన్ ఆరోపణలను ఖండించారు శ్రీవాస్తవ. పాక్.. తమ దేశంలో సమస్యలు పెట్టుకుని భారత్‌ను నిందించడం సరికాదన్నారు. భారత్‌పై ఆరోపణలు చేసే పాకిస్థానీలు.. ముందు తమ ప్రభుత్వం వైఖరిని పరిశీలించాలని.. ముఖ్యంగా ఓ అంతర్జాతీయ ఉగ్రవాదిని అమర వీరుడిగా అభివర్ణించిన తమ ప్రధాని వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకోవాలన్నారు.
ఇదీ చూడండి- బాయ్‌కాట్ చైనా: డ్రాగన్‌తో ఆ కంపెనీ బంధం కట్!