పారా మిలిటరీ దళాలు, పోలీసు సిబ్బంది గ్రంథాలయంలో చదువుకుంటున్న విద్యార్థులను లాఠీలతో కొడుతున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమించిన విద్యార్థులపై పోలీసులు క్రూరంగా విరుచుకుపడ్డారంటూ.. జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయ (జేఎంఐ) విద్యార్థుల సమన్వయ సంఘం ఈ దృశ్యాలు విడుదల చేసింది. అయితే, ఈ వీడియోతో విశ్వవిద్యాలయానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు జామియా అధికార ప్రతినిధి మహ్మద్ ఆజీమ్.
పూర్వ విద్యార్థుల సమన్వయ సంఘం విడుదల చేసిన ఆ వీడియోను... జామియా వర్సిటీ అధికారికంగా గుర్తించట్లేదని ఆయన వెల్లడించారు.
వీడియోలో ఏముంది...?
గత ఏడాది డిసెంబర్ 15న జరిగిన ఘటనలో విశ్వవిద్యాలయ గ్రంథాలయం లోపల విద్యార్థుల్ని పారా మిలిటరీ దళాలు, పోలీసు సిబ్బంది లాఠీలతో కొడుతున్నట్లుగా ఈ 48 సెకెన్ల వీడియోలో ఉంది. తొలి వీడియో బయటకు వచ్చిన కొన్ని గంటల తర్వాత మరో రెండు వీడియోలు వెలుగు చూశాయి.
ఓ వీడియోలో ముఖాలకు ముసుగులు ధరించిన కొందరు యువకులు విశ్వవిద్యాలయం ప్రాంగణంలోకి వస్తున్నట్లు.. వారు పోలీసుల కంట పడకుండా మరికొందరు అడ్డుగా నిల్చొన్నట్లు ఉంది. గ్రంథాలయ ప్రధాన ద్వారాలకు అడ్డంగా బల్లలు, కుర్చీలు పడవేస్తూ ఇంకొందరు కనిపించారు. అది ఎప్పుడు జరిగిందనే వివరాలు మాత్రం వీడియోపై లేవు. ముఖానికి ముసుగులు, చేతుల్లో రాళ్లతో కొందరు ఉన్నట్లు మూడో వీడియోలో కనిపించింది.
ఇదీ చదవండి:'జామియా దృశ్యాలను మానవ హక్కుల సంఘానికి పంపిస్తాం'