పార్లమెంటులో వ్యవసాయ బిల్లుల ఆమోదంపై హర్షం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారతదేశ వ్యవసాయ రంగంలో ఇది చారిత్రక మలుపుగా అభివర్ణించారు.
రైతులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని.. ఈ బిల్లులు వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకొస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బిల్లులకు ఆమోదం అనంతరం.. వరుస ట్వీట్లు చేశారు.
''భారతదేశ వ్యవసాయ రంగం చరిత్రలో ఇదో విప్లవాత్మక మలుపు. బిల్లుల ఆమోదంతో ఈ రంగంలో సంస్కరణలు వస్తాయి. రైతులకు సాధికారత చేకూరుతుంది. దళారుల జోక్యం, ఇతర అడ్డంకుల నుంచి ఇప్పుడు రైతులకు స్వేచ్ఛ లభిస్తుంది.''
- నరేంద్ర మోదీ, భారత ప్రధాని
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే ప్రయత్నాలకు ఈ బిల్లులు ఊతమిస్తాయని, ఉత్పత్తిని పెంచడంలోనూ తోడ్పాటు అందిస్తాయని వివరించారు మోదీ.
కనీస మద్దతు ధర(ఎంఎస్పీ), పంటను ప్రభుత్వం సేకరించే వ్యవస్థ అలాగే కొనసాగుతుందని ఉద్ఘాటించారు ప్రధాని. రైతులకు సేవ చేసేందుకే అధికారంలో ఉన్నామని.. భవిష్యత్తు తరాలకు మెరుగైన జీవనాన్ని అందించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
భాజపా హర్షం..
పార్లమెంటులో వ్యవసాయ బిల్లుల ఆమోదంపై సంతోషం వ్యక్తం చేశారు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా. పంటను విక్రయించుకునేందుకు రైతులకు ఇప్పుడు స్వేచ్ఛ లభిస్తుందని అన్నారు. ఈ బిల్లులతో రైతులకు అదనపు ప్రయోజనాలు చేకూరుతాయని పేర్కొన్నారు.
రైతులు చైతన్యవంతం కావడం కాంగ్రెస్కు, రాహుల్ గాంధీకి ఇష్టం లేదని విమర్శించారు నడ్డా. ఎన్నో ఏళ్లుగా పేదల్ని, రైతుల్ని తప్పుదోవ పట్టిస్తూ.. రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
'' రైతులకు చేయూత అందించడంలో ప్రధాని నరేంద్ర మోదీ మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారి ఆదాయం రెట్టింపు అవడానికి.. ఈ బిల్లులు కీలకంగా నిలుస్తాయి.''
- జేపీ నడ్డా, భాజపా అధ్యక్షుడు
కేంద్రం ప్రతిపాదించిన రెండు వ్యవసాయ బిల్లులకు ఆదివారం రాజ్యసభలో ఆమోదం లభించింది. విపక్షాల ఆందోళనల నడుమే.. ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్), ఫార్మర్స్ (ఎంపవర్‌మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫామ్ సర్వీసెస్ బిల్లులు మూజువాణి ఓటుతో గట్టెక్కాయి.