మహారాష్ట్రలోని ముంబయి మహానగరం తడిసిముద్దవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాంతాలు జలమయ్యాయి. రోడ్లపై ఎక్కడికక్కడ నీరు చేరి వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. జనజీవనం అస్తవ్యస్తమైంది. విద్యుత్తు లేక అంధకారంలోనే గడుపుతున్నారు.
రైల్వేస్టేషన్లలో నీరు నిలిచిపోయిన కారణంగా.. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ముంబయిలోని నాలా సోపారా స్టేషన్లోకి భారీగా నీరు చేరింది. భాండుప్ల్ రోడ్లపై నీరు చేరి ఆ ప్రాంతమంతా నదిని తలపిస్తోంది.
నగరంలో 2 రోజుల్లోనే 540 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ముంబయి మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు. మరో రెండు రోజులు కూడా అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
ప్రస్తుత వర్షాలకు బయటకు వచ్చే పరిస్థితీ లేకపోవడం వల్ల ముంబయి వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు నేడు సెలవు ప్రకటించారు అధికారులు.