పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా కర్ణాటక మంగళూరులో డిసెంబర్ 19న జరిగిన హింసాత్మక నిరసనలకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వుతున్న దృశ్యాలు ఇందులో నమోదయ్యాయి. పోలీసులపై విసరడానికి ట్రాలీ ఆటోలో దుండగులు రాళ్లు తీసుకొచ్చినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కొందరు దుండగులు ముఖాలకు ముసుగులు ధరించి, సీసీటీవీ కెమెరాల్లో కనపించకుండా జాగ్రత్త పడ్డారు.
ఈ దృశ్యాలు చూస్తే హింసాత్మక నిరసనలు చేయడానికి ముందుగానే ప్రణాళికలు రచించినట్లు అర్థమవుతోందని భాజపా వ్యాఖ్యానించింది. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించింది. హింసాత్మక నిరసనలను నిలువరించడానికి పోలీసులు చేసిన కృషిని అభినందించారు కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ బొమ్మై. రాళ్లు రువ్వుతున్న నిరసనకారులను అమాయకులుగా పేర్కొన్న కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యను తప్పుబట్టారు.
పోలీసులు బాష్పవాయుగోళాలు ప్రయోగించినందునే తప్పని పరిస్థితుల్లో నిరసనకారులు ముఖాలకు మాస్కులు ధరించారని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్ గుండు రావు చెప్పారు.
డిసెంబర్ 19న..
డిసెంబర్ 19న బెంగళూరు, మంగళూరు నగరాలలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. నిరసనలు హింసాత్మకంగా మారడం వల్ల నగరంలో 144వ సెక్షన్ విధించారు పోలీసులు. నలుగురికన్నా ఎక్కువ మంది సమావేశమవడంపై నిషేధం విధించారు. బెంగళూరులో సుమారు 100 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చరిత్రకారుడు రామచంద్ర గుహనూ అరెస్ట్ చేశారు.