హిమాలయ నదుల్లో చల్లటి వాతావరణంలో పెరిగే మంచినీటి చేపలు(స్నోట్రౌట్) క్రమంగా తగ్గిపోతున్నాయి. వాతావరణ మార్పులతో నీరు వేడెక్కిపోతుండటం వల్ల వీటి నివాస ప్రాంతాలు వచ్చే 30 ఏళ్లలో 16 శాతం, 2070 నాటికి 26 శాతం తగ్గిపోతాయని 'వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా' శాస్త్రవేత్తల అధ్యయనం పేర్కొంది. నెదర్లాండ్స్‌కు చెందిన 'ఎకాలాజికల్ ఇండికేటర్స్' జర్నల్‌లో ఇటీవల ఈ వివరాలు ప్రచురించారు.
పరిశోధన సాగిందిలా..
హిమాలయాల పరిధిలో మొత్తం 72 ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. తక్కువ ఎత్తులో ఉన్న నదీ ప్రవాహాలతో ఉష్టోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. దీనితో సున్నితమైన చేపలన్నీ సురక్షిత ప్రాంతాలు వెతుక్కుంటూ నదుల పై భాగంలోకి చేరుకుంటున్నట్లు గుర్తించారు. వీటికి వాణిజ్య విలువ కూడా ఎక్కువ. భవిష్యత్తులో ఈ రకం చేపలకు ఎత్తయిన ప్రాంతాల్లోని నదీ ప్రవాహాలే సురక్షిత స్థావరాలుగా మిగులుతాయని నిర్ధరించారు పరిశోధకులు.
చేపలకు సవాళ్లు..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్వత వ్యవస్థలన్నీ వాతావరణ మార్పులతో మరింత సున్నితంగా మారుతున్నాయి. హిమాలయాల్లో ఈ మార్పులు మరింత హానికంగా ఉన్నాయి. ఉష్టోగ్రతలు పెరగటం, హిమనీనదాలు కరగడం వంటివి మిగతా ప్రాంతాల కంటే హిమాలయాల్లోనే ఎక్కువ. నదీ లోయల మార్పులు, విచ్చల విడిగా చేపల వేట ఇతర రకాల సాల్మోనిడ్ చేపలు చేరుతుండటం వంటివి ఇక్కడ చల్లటి నీటి చేపలకు హానికరంగా మారుతున్నాయని అధ్యయనం వివరించింది. నదులపై ఆనకట్టల నిర్మాణం పెరిగిపోతుండటం వల్ల అవి సురక్షిత ప్రాతాలకు చేరుకోవడం కష్టమై ప్రమాదంలో పడిపోతున్నాయని పరిశోధనలో తేలింది.
వీటి సంరక్షణ కోసం ఏం చేయాలో కూడా అధ్యయనం సూచించింది. హిమాలయ నదుల జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు భారత్, నేపాల్, భూటాన్‌లు రాజకీయ సరిహద్దులకు అతీతంగా పరిరక్షణ విధానాలు రూపొందించాలని కోరింది. హైడల్ పవర్ ప్రాజెక్టుల కోసం నీటని నిలిపి ఉంచడం తగ్గిచాలి. హిమాలయ ప్రాంతాల్లో వాతావరణ మార్పులపై శ్రద్ధ పెట్టాలని కోరింది.
ఇదీ చూడండి:'రఫేల్' వాయుసేనలోకి చేరే కీలక ఘట్టం నేడే