పుస్తకాన్ని ఆప్తమిత్రుడిగా చేసుకున్నవారు ఆనందమయ జీవితం గడుపుతారని పెద్దలు చెప్తుంటారు. అందుకే చిన్ననాటి నుంచి పిల్లలకు పుస్తకాలు చదవడం అలవాటు చేయాలని సూచిస్తుంటారు. మరి ఆధునిక యుగంలో పరిస్థితి మారింది. టెక్నాలజీ రాకతో పుస్తకాలకు, మనుషులకు మధ్య అంతరం పెరిగిపోతోంది. శ్రద్ధగా చదువుకోవాల్సిన పిల్లలు చరవాణితోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. అంతర్జాలంలోనే సమాచారం దొరకడం వల్ల పుస్తకాలు పట్టుకొని చదివేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. అయితే... జ్ఞానసముపార్జనలో పుస్తకాలదే కీలకపాత్రని గుర్తించారు పంజాబ్ బర్నాలా జిల్లా దివానా గ్రామంలోని కొందరు యువత. అందరికీ పుస్తక పఠనం వైపు ఆసక్తి కల్పించాలని సంకల్పించారు.
ఇందుకోసం పెయింటింగ్‌ను ఎంచుకున్నారు. పంజాబ్ ఉద్యమకారుడు 'షహీద్ కర్తార్ సింగ్ షరభా' పేరిట ఓ గ్రంథాలయం ఏర్పాటు చేసి.. స్థానికులంతా అక్కడకు వచ్చి చదువుకునేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాదు గ్రామంలోని గోడలపై బొమ్మలు గీస్తూ.. పుస్తక పఠనం వల్ల కలిగే ఉపయోగాలను వివరిస్తున్నారు. ఆ చిత్రాల సాయంతోనే గ్రంథాలయం విలువ గురించి హితబోధ చేస్తున్నారు.
"తొలి విడతగా మొదట 10 పెయింటింగ్‌లు వేశాం. గోడలపై బొమ్మలు చూసి ప్రజలు చాలా సంతోషించారు. పుస్తక పఠనం ప్రోత్సహించడానికి తమ గోడలపైనా కళాకృతులు గీయాలని అభ్యర్థనలు పెరిగాయి. డబ్బు కొరత వల్ల కేవలం తక్కువ సంఖ్యలోనే చిత్రాలు వేయగలిగాం. భవిష్యత్తులో మరిన్ని పెయింటింగ్‌లు వేస్తాం."
- వరిందర్, దివానాలోని గ్రంథాలయ నిర్వాహకుడు
ప్రముఖ రచయితలు, కవుల గురించి ప్రస్తావిస్తూ.. వారి సూక్తులు, కావ్యాలు, రచనలను పెయింటిగ్ల రూపంలో చిత్రీకరిస్తున్నారు. అందరికీ పుస్తకాల ప్రాముఖ్యాన్ని తెలియజేస్తున్నారు.
"గ్రామంలోని గోడలపై పెయింటింగ్‌లు వేస్తున్నాం. పిల్లలు, యువత, పెద్దలు పుస్తకాలకు దగ్గరవ్వాలని కోరుకుంటున్నాం. ఫోన్లకు అతుక్కుంటున్నట్లే పుస్తకాలకు అతుక్కోవాలని మేము భావిస్తున్నాం. ఈ పెయింటింగ్‌లు లైబ్రరీకి ఎక్కువమందిని ఆకర్షించేలా సహాయపడుతున్నాయి."
- ప్రదీప్ కుమార్, గ్రంథాలయ నిర్వాహకుడు
బాబా నజ్మీ గోడలపై రాసిన పద్యాలు ఆకట్టుకుంటున్నాయి. పాష్ , మాక్షిమ్ గోర్కి రాసిన రచనలు ప్రజల మనసులు దోచుకుంటున్నాయి. షహీద్ కర్తార్ సింగ్ షరభాపై గీసిన పెయింటింగ్‌లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందుకే గ్రంథాలయ నిర్వాహకుల ఆలోచనకు ప్రశంసలు దక్కుతున్నాయి.
నేటితరం మొబైళ్లపైనే ఎక్కువ దృష్టిపెడుతోంది.పెయింటింగ్ వేస్తూ మంచిపని చేస్తున్నారు. దాదాపు 10 నుంచి 12 చోట్ల బొమ్మలు చిత్రీకరించారు. మా ఇళ్ల గోడలపైనా అలాంటి పెయింటింగ్‌లు వేయాలని మేమూ అడుగుతున్నాం.
- సుదర్శన్ సింగ్, గ్రామస్థుడు
యువతను పుస్తక పఠనంవైపు మళ్లించేలా బొమ్మలు, సూక్తులు ప్రేరణ కల్పిస్తున్నాయి.
"గోడలపై మేము రాసిన వాక్యాలను చాలా మంది చదువుతున్నారు. కొంతమంది ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. బొమ్మలతో ఆ తరహా వాతావరణం సృష్టించాం. మా ప్రయత్నం ప్రజలను పుస్తకాల వైపు మళ్లిస్తోంది. ఇది నిజంగా మంచి నిర్ణయం. ప్రతి గ్రామంలోనూ ఇలా చేయాలని భావిస్తున్నాం."
-గహిల్ ఖేది, చిత్రకారుడు
పుస్తకాలు విజ్ఞానానికి నిధులని, మనోవికాసానికి దోహదం చేస్తుంటాయని చెబుతుంటారు. మరి వాటిని పఠించే అదృష్టం అందరికీ దక్కాలనే దిశగా దివానా గ్రామ గ్రంథాలయ నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. పుస్తకాలను స్నేహితులుగా మలచుకోవాలని యువతకు దిశానిర్దేశం చేస్తున్నారు.
ఇలాగే పుస్తక పఠనం సంస్కృతిని ప్రోత్సహించడానికి ప్రతి గ్రామం ముందడుగు వేయాలి. అది నేటి యువతకు వారి సంస్కృతి, సాహిత్యం, చరిత్ర గురించి బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.
ఇదీ చూడండి: పిచ్చుకల రక్షణ కోసం 'వీర' ప్రయత్నం